మొట్ట మొదటి తెలంగాణ టీ20 లీగ్ ఎడిషన్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్నద్దమైంది. జూన్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో జట్ల యాజమాన్యం కోసం టెండర్ ప్రక్రియను హెచ్‌సీఏ ప్రారంభించింది. జట్టు యాజమాన్య హక్కులు మొదటి 5 ఏళ్ల కాలానికి ఇవ్వబడతాయి.
ఆ తర్వాత ప్రతి 3 ఏళ్లకు ఒకసారి రెన్యూవల్ చేస్తారు. ఒక్కో జట్టుకు కనీస బిడ్ ధర రూ. 3 కోట్లుగా నిర్ణయించారు. ఆటగాళ్ల జీతాలు, సిబ్బంది ఖర్చులు, వసతి, జెర్సీల ఖర్చులను ఫ్రాంచైజీ యజమానులే భరించాలి. కొత్త జట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు ఏప్రిల్ 28లోపు టెండర్ పత్రాలు సమర్పించాలి.
ఏప్రిల్ 30న షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలను ప్రకటించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గోనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ ,మహబూబ్‌నగర్ ప్రాంతాలను ప్రాతిపాదించారు. ఆఖరికి బిడ్డింగ్ ద్వారా 8 జట్లను ఖరారు చేస్తారు. ఈ టోర్నీ 21 రోజులు పాటు ఉప్పల్ మైదానం వేదికగా జరగనుంది. మొత్తంగా 32 మ్యాచ్‌లు జరుగుతాయి.


