Hasan Ali: క్యాచ్‌ డ్రాప్‌ చేసినందుకు.. ఎంతగా ఏడ్చానో.. రెండ్రోజులు నిద్రపోలేదు.. నా భార్య కంగారుపడింది.. ఆ తర్వాత

Hasan Ali Breaks Silence On Dropped Catch During T20 WC 2021 Not Slept - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో సూపర్‌ 12 దశలో అద్భుత విజయాలు సాధించిన పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన బాబర్‌ ఆజమ్‌ బృందం... రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటి బాట పట్టింది. 5 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఫైనల్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.  ముఖ్యంగా మార్కస్‌ స్టొయినిస్(40 పరుగులు)‌, మాథ్యూ వేడ్‌(41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించారు. 

ఇక షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో వేడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను... హసన్‌ అలీ మిస్‌ చేయగా.. దొరికిన లైఫ్‌ను అతడు సద్వినియోగం చేసుకున్నాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది ఇంకో ఓవర్‌ మిగిలి ఉండగానే కంగారూలను గెలిపించాడు. దీంతో హసన్‌ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. అతడి భార్యను ఉద్దేశించి కూడా కొంతమంది నీచపు కామెంట్లు చేశారు.

ఈ విషయంపై తాజాగా స్పందించిన హసన్‌ అలీ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నాడు. క్రికెట్‌ పాకిస్తాన్‌తో మాట్లాడిన అతడు... ‘‘నా కెరీర్‌లో అది అత్యంత కఠిన సమయం. ఆ మ్యాచ్‌ ఫలితాన్ని అస్సలు మర్చిపోలేకపోయాను. ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోని విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నా. ఆ రోజు మ్యాచ్‌ తర్వాత రెండు రోజుల పాటు నేను నిద్రపోలేదు. ఏడ్చాను. నా భార్య చాలా కంగారుపడింది. టెన్షన్‌కు గురైంది. నేను ఏమైపోతానో అని భయపడింది. 

నేను మాత్రం డ్రాప్‌ చేసిన ఆ క్యాచ్‌ గురించే తీవ్రంగా ఆలోచించేవాడిని. ప్రతిసారి ఆ విషయమే గుర్తుకు వచ్చేది. అయితే, బంగ్లాదేశ్‌ పర్యటనకు పయనమైన తర్వాత నాలో కాస్త మార్పు వచ్చింది. చేదు ఘటనను మర్చిపోయి ముందుకు సాగాలని నాకు నేనే నచ్చజెప్పుకొన్నాను’’ అని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో సహచర ఆటగాళ్లు ముఖ్యంగా షోయబ్‌ భాయ్‌ తనకు అండగా నిలిచాడన్న హసన్‌ అలీ... నువ్వు టైగర్‌ అంటూ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడని గుర్తు చేసుకున్నాడు. 

తాను ఏడుస్తుంటే షాహిన్‌ కూడా ఏడ్చాడని అంతా కలిసి తమను ఓదార్చారని పేర్కొన్నాడు. ఇక సోషల్‌ మీడియాలో అభిమానులు సైతం తనకు మద్దతుగా నిలబడ్డారని, వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక పాకిస్తాన్‌పై విజయంతో ఫైనల్‌లో ప్రవేశించిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ మీద గెలుపొంది తొలిసారి టీ20 ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

చదవండి: Sourav Ganguly: మొన్న కోహ్లిని అలా.. ఇప్పుడు ఇలా.. మరో వివాదంలో గంగూలీ.. సిగ్గుపడండి.. ఎందుకిలా? పాపం కెప్టెన్‌, కోచ్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top