Sourav Ganguly: మొన్న కోహ్లిని అలా.. ఇప్పుడు ఇలా.. మరో వివాదంలో గంగూలీ.. సిగ్గుపడండి.. ఎందుకిలా? పాపం కెప్టెన్‌, కోచ్‌!

Sourav Ganguly Allegedly Attending Selection Meeting Fans Calls Disgrace - Sakshi

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరో వివాదంలో చిక్కుకున్నారు. బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఆయన సెలక్షన్‌ మీటింగ్స్‌కు హాజరవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో గంగూలీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై బోర్డు వర్గాలు రెండుగా చీలినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బోర్డులోని ఓ వర్గం ఇదంతా అసత్య ప్రచారం అంటూ కొట్టిపారేయగా... గంగూలీ వ్యవహార శైలి దురదృష్టకరమంటూ మరో వర్గం జాతీయ మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం.

అప్పుడేమో అలా..
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు విరాట్‌ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి గంగూలీ మాట్లాడుతూ... పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే సారథి ఉండాలన్న భావనతో సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు. తాను టీ20 కెప్టెన్సీ వైదొలవద్దని చెప్పినా కోహ్లి వినలేదని, ​అందుకే ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లి ఈ వ్యాఖ్యలను ఖండించాడు. తనను ఎవరూ సంప్రదించలేదని కుండబద్దలు కొట్టాడు. దీంతో గంగూలీ తీరుపై విమర్శల జడి కురిసింది.

ఇప్పుడు తాజాగా ఆయనపై మరోమారు ఆరోపణలు రావడం గమనార్హం. ఓ జర్నలిస్టు ట్విటర్‌ వేదికగా గంగూలీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సెలక్షన్‌ కమిటీ సమావేశాలకు హాజరవుతూ ఓ వ్యక్తి అక్కడి అంశాలను ప్రభావితం చేస్తున్నారు. నిజానికి వీటన్నింటికి దూరంగా ఉండాలని ఆయనకు తెలుసు. అయినా కూడా అలాగే చేస్తున్నారు. కెప్టెన్‌, కోచ్‌ నిస్సహాయులుగా మారిపోయారు. వాళ్లేమీ చేయలేరు కదా! అసలు ఆయనకు అక్కడేం పని. భవిష్యత్తులో  ఇలాంటివి పునరావృతం కావనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. 

అయితే, ఈ ట్వీట్‌లో ఎక్కడా గంగూలీ ప్రస్తావించపోయినప్పటికీ... ఆ వ్యక్తి గంగూలీనే అంటూ టీమిండియా అభిమానులు ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్‌ చేస్తూ... ‘‘మొన్న కోహ్లి విషయంలో అలా.. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఇలా... గంగూలీ గద్దె దిగే సమయం ఆసన్నమైంది. సిగ్గు పడండి’’ అంటూ  ట్రోల్‌ చేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం జట్టు ప్రయోజనాలను పణంగా పెట్టవద్దంటూ హితవు పలుకుతున్నారు.

కాగా ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో భంగపాటుకు గురైన నేపథ్యంలో.. ఈ సిరీస్‌ భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇలాంటి తరుణంలో బోర్డు ప్రెసిడెంట్‌ ఇలా వ్యవహరించడమేమిటని, జట్టు ఎంపిక సరిగా లేకపోతే వరుస పరాజయాలు తప్పవంటూ అభిమానులు మండిపడుతున్నారు.

బీసీసీఐ రాజ్యాంగం ఏం చెబుతోంది?
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. బోర్డు అధ్యక్షుడు సెలక్షన్‌ విషయంలో జోక్యం చేసుకోకూడదు. అయితే, కార్యదర్శికి మాత్రం సెలక్షన్‌ కమిటీ సమావేశాలకు హాజరయ్యే వెసలుబాటు ఉంటుంది. ఇక జట్టు ఎంపిక, కెప్టెన్‌ తదితర అంశాలకు సంబంధించి సెలక్షన్‌ కమిటీదే అంతిమ నిర్ణయం. కెప్టెన్‌, కోచ్‌లతో చర్చించి జట్టును ఖరారు చేస్తుంది. 

చదవండి: Under 19 WC Eng Vs Afg: అఫ్గన్‌పై ఉత్కంఠ విజయం.. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్‌లో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top