
ప్రపంచకప్ వేటలో ఉన్న భారత శిబిరంలో కాస్త ఆందోళన పెంచే ఘటన మైదానంలో జరిగింది. బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తన తొలి ఓవర్ మూడో బంతిని బ్యాటర్ దాస్ నేరుగా ఆడగా బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా తన కాలును బాగా ముందుకు జరిపాడు. ఈ క్రమంలో అతని చీలమండ భాగం మడత పడింది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. ప్రాథమిక చికిత్స చేసినా లాభం లేకపోవడంతో అలాగే మైదానం వీడాడు. కొద్ది సేపటికే ఈ మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేయడని బీసీసీఐ ప్రకటించింది.
అతని కాలికి స్కాన్ నిర్వహించినట్లు తెలిసింది. దాని ఫలితాలపై పూర్తి సమాచారం లేకున్నా మ్యాచ్ తర్వాత రోహిత్ ‘పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడం మాకు ఊరట. అయితే ప్రతీ రోజు గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని స్పష్టతనిచ్చాడు. పాండ్యా తప్పుకోవడంతో ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను కోహ్లి బౌల్ చేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి ముందు 2017లో శ్రీలంకపై చివరిసారిగా కోహ్లి బౌలింగ్ చేశాడు.