
కోవిడ్ మందుల అక్రమ నిల్వల కేసులో టీమిండియా హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చర్యలపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలన్న గంభీర్ పిటిషన్‌ను న్యాయమూర్తి నీనా బన్సల్ కృష్ణా ఆగస్టు 29న విచారించేందుకు అంగీకరించినప్పటికీ, తక్షణ ఉపశమనం మాత్రం ఇవ్వలేదు.
విచారణ సందర్భంగా గంభీర్ తరఫు న్యాయవాదులు ఆయన సేవా కార్యక్రమాలు, క్రికెట్‌లో అతని కీర్తి, ఎంపీగా చేసిన సేవలు వంటి అంశాలను ప్రస్తావించగా, న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. పేరు చెప్పి కోర్టును ప్రభావితం చేయరాదని మందలించారు.
ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 8న ట్రయల్ కోర్టు విచారణ ఉన్నందున, ఆదివారం (ఆగస్టు 29)లోపు ఉపశమనం ఇవ్వాలని గంభీర్ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే హైకోర్టు తక్షణమే స్టే ఇవ్వకుండా, కేసును విచారించేందుకు మాత్రమే అంగీకరించింది.
కాగా, 2021 కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో గౌతమ్ గంభీర్, అతని ఫౌండేషన్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసి పంపిణీ చేసిందని ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి గంభీర్ తరఫు న్యాయవాదులు నాలుగేళ్లుగా వాదనలు వినిపిస్తున్నారు.
కోవిడ్ సమయంలో ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను ప్రజల సహాయార్థం పంపిణీ చేశారని, సేవా కార్యక్రమాలకు లైసెన్సుల అవసరం లేదని గంభీర్ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ఈ వాదనలతో కోర్టులు ఏకీభవించడం లేదు. ఏ ఉద్దేశంతో చేసినా ఔషధాల నిల్వ, పంపిణీ విషయంలో చట్టపరమైన నియమాలు తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి.