Garry Ballance: రెండు దేశాల తరపున సెంచరీ.. టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు

Garry Ballance Become-2nd-Batter Hitting Test-Tons-For Two-Countries - Sakshi

జింబాబ్వే క్రికెటర్‌ గ్యారీ బ్యాలెన్స్‌ అరంగేట్రం టెస్టులోనే శతకంతో అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో గ్యారీ బ్యాలెన్స్‌ ఈ ఫీట్‌ సాధించాడు. కష్టాల్లో ఉన్న జింబాబ్వే ఇన్నింగ్స్‌ను తన శతకంతో నిలబెట్టాడు. బ్రాండన్‌ మవుటా(52 బ్యాటింగ్‌)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 121 పరుగులు జోడించాడు.

ఎంతో ఓపికతో ఆడిన బ్యాలెన్స్‌ 190 బంతుల్లో 9ఫోర్లు, రెండు సిక్సర్లతో శతకాన్ని అందుకున్నాడు. టీ విరామ సమయానికి జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్‌ 107 పరుగులు, బ్రాండన్‌ మవుటా 52 పరుగులు క్రీజులో ఉన్నారు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 447 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. 

ఇక తన అరంగేట్రం టెస్టులోనే శతకంతో మెరిసిన గ్యారీ బ్యాలెన్స్‌ టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. వాస్తవానికి గ్యారీ బ్యాలెన్స్‌కు టెస్టుల్లో ఇది ఐదో సెంచరీ. అయితే ముందు వచ్చిన నాలుగు టెస్టు సెంచరీలు ఇంగ్లండ్‌ తరపున చేశాడు. తాజాగా మాత్రం జింబాబ్వే తరపున శతకం మార్క్‌ను అందుకున్నాడు.

2013 నుంచి 2017 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్యారీ బ్యాలెన్స్‌ నాలుగు టెస్టు శతకాలు సాధించడం విశేషం. ఇలా రెండు దేశాల తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గ్యారీ బ్యాలెన్స్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకముందు కెప్లర్‌ వెసెల్స్‌ ఈ ఫీట్‌ సాధించాడు. 1982-85 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు.. ఆ తర్వాత 1991-94 మధ్య తన స్వంత దేశమైన సౌతాఫ్రికాకు ఆడాడు.

ఈ సమయంలోనే రెండు దేశాల తరపున టెస్టు సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. తాజాగా గ్యారీ బ్యాలెన్స్‌ ఇంగ్లండ్‌, జింబాబ్వే తరపున టెస్టుల్లో శతకాలు చేసిన క్రికెటర్‌గా కెప్లర్‌ వెసెల్స్‌ సరసన చేరాడు. ఇక గ్యారీ బ్యాలెన్స్‌ మరో అరుదైన ఫీట్‌ను కూడా అందుకున్నాడు. అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన 24వ క్రికెటర్‌గా నిలిచాడు.

గ్యారీ బ్యాలెన్స్‌ పుట్టి, పెరిగి, విద్యనభ్యసించింది జింబాబ్వేలోనే. అయితే బ్యాలెన్స్‌ 2006లో తన తాతముత్తాతల దేశమైన బ్రిటన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఇంగ్లండ్‌ తరఫున క్రికెట్‌ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్‌.. ఆ క్రమంలో  కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి నాలుగేళ్లపాటు (2017 వరకు) ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్‌.. ఆతర్వాత ఫామ్‌ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.

ఆ తర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్‌కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్‌ ఇంగ్లండ్‌ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో బ్యాలెన్స్‌ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్‌ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు.

చదవండి: ఐపీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌.. రేసులో గిల్‌, సిరాజ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top