‘యూకేలో పెరిగితే ఇంతకాలం బతికేవాడిని కాను’ | Sakshi
Sakshi News home page

‘యూకేలో పెరిగితే ఇంతకాలం బతికేవాడిని కాను’

Published Tue, Jun 22 2021 11:00 AM

Former West Indies Fast Bowler Michael Holding on Racism - Sakshi

జోహెన్నెస్‌బర్గ్‌: మాజీ వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మైకెల్‌ హోల్డింగ్‌ జాత్యహంకార ధోరణిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదృష్టవశాత్తు తాను ఇంగ్లండ్‌లో పెరగలేదని.. లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే తాను మరణించేవాడినని పేర్కొన్నాడు. యవ్వనంలో ఉండగా తాను చాలా దూకుడుగా వ్యవహరిచేంవాడినని.. ఆ సమయంలో తాను ఇంగ్లండ్‌లో ఉంటే కచ్చితంగా ఈపాటికే మరణించేవాడినన్నాడు మైకెల్‌. అమెరికాలో చోటు చేసుకున్న జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతం తర్వాత వచ్చిన బ్లాక్‌లైవ్స్‌ మ్యాటర్‌ ఉద్యమంలో మైకెల్‌ చురుకుగా వ్యవహరిస్తున్నాడు. జాత్యాహంకార ధోరణిపై మైకెల్‌ ‘‘వై వీ నీల్‌, హౌ వి రైజ్‌’’ అనే పుస్తకాన్ని రాశాడు. త్వరలోనే ఇది విడుదల కానుంది.

ఈ క్రమంలో మైకెల్‌ మాట్లాడుతూ.. ‘‘నేను జమైకాలో పెరిగాను. కనుక ఎప్పుడు జాత్యహంకారాన్ని చవి చూడలేదు. కానీ అక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్లిన ప్రతి సారి నేను నేను దాన్ని ఎదుర్కొన్నాను. ప్రతిసారి నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని.. ఇది నీ దేశం కాదు.. త్వరలోనే నీవు నీ స్వస్థలం వెళ్తావు. అక్కడ నీకు ఇలాంటి చెడు అనుభవాలు ఎదురుకావని నాకు నేనే నచ్చచెప్పుకునేవాడిని’’ అని తెలిపాడు. ‘‘ఇక యువకుడిగా ఉన్నప్పుడు నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. నేను న్యూజిలాండ్ (1980) లో ఉండగా మైదానం నుంచి ఒక స్టంప్‌ను బయటకు తన్నాను. అదృష్టం కొద్ది నేను ఇంగ్లండ్‌లో పెరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆనాటి నా ప్రవర్తన తర్వాత నేను ఇంతకాలం బతికి ఉండేవాడినే కాదు” అని హోల్డింగ్ ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

“ఈ విషయంలో నేను ఓ స్టాండ్‌ తీసుకుంటే నా కెరీర్ ఇప్పుడున్నంత కాలం ఉండేది కాదు. అలానే నాకు ఈ సుదీర్ఘ టెలివిజన్ కెరీర్ కూడా ఉండేది కాదు. తమ హక్కుల కోసం నిలబడి అన్యాయాన్ని ఎదిరించిన నల్లజాతీయులు బాధితులవుతున్నారని మేము చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. ఒకవేళ నేను కూడా ఈ జాత్యహంకార ధోరణి గురించి మాట్లాడి ఉంటే వారు ‘మరో యువకుడు మనల్ని ఎదరిస్తున్నాడు.. అతనిని వదిలించుకోండి’ అని చెప్పేవారు. అప్పుడు నేను పేడ కుప్పలో మరొక వ్యక్తిగా ఉండేవాడిని” అన్నాడు హోల్డింగ్‌. 

Advertisement

తప్పక చదవండి

Advertisement