సివిల్స్ ర్యాంకు కొట్టిన టీం ఇండియా క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా.?

Former Cricketer and IAS Officer Amay Khurasiya Success Story - Sakshi

యూపీఎస్సీ(UPSC).. షార్ట్‌కట్‌లో సివిల్స్‌ ఎగ్జామ్‌. దేశంలో అత్యంత కఠిన పరీక్ష​గా సివిల్స్‌ ఎగ్జామ్‌కు పేరు ఉంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఉంటుంది. జీవితంలో ఎంత మంచి స్థాయిలో ఉన్నా సివిల్స్‌ ఇచ్చే కిక్కు వేరు. దేశానికి సేవ చేసే అవకాశం సివిల్స్‌ రూపంలో వ‌స్తుండడంతో యువత అడుగులు సివిల్స్ వైపు ఉంటాయి.

ప్రతీ ఏటా లక్షల మంది సివిల్స్‌ రాస్తున్నప్పటికి క్లియర్‌ చేసే వారి సంఖ్య వందల్లో మాత్రమే ఉంటుంది. అంత క్రేజ్‌ ఉన్న యూపీఎస్సీ ఎగ్జామ్‌ను ఒక టీమిండియా క్రికెటర్‌ క్లియర్‌ చేశాడన్న సంగతి మీకు తెలుసా. ఆటల్లో ఎక్కువగా ఆసక్తి కనబరిస్తే చదువులో వెనుకబడిపోతారనేది సహజంగా అందరూ అంటుంటారు.

క్రికెట్ కంటే ముందే....

ఆటతో సమానంగా చదువులోనూ రాణించగలనని ఒక టీమిండియా క్రికెటర్‌ నిరూపించాడు. అతనెవరో కాదు.. మాజీ క్రికెటర్‌ అమే ఖురేషియా. 1972లో మధ్యప్రదేశ్‌లో జన్మించిన ఖురేషియా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టకముందే సివిల్స్‌ క్లియర్‌ చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు అమే ఖురేషియా.

17 ఏళ్ల వయసులోనే....

17 ఏళ్ల వయసులోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అమే ఖురేషియా చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. క్రికెటర్‌గా మారకపోయుంటే కచ్చితంగా ఐఏఎస్‌ అవ్వడానికి ప్రయత్నించేవాడినని ఖురేషియా పలు సందర్భాల్లో పేర్కొనేవాడు. అయితే చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయని ఖురేషియా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతూనే మధ్యప్రదేశ్‌ నుంచి సివిల్స్‌ ఎగ్జామ్‌ను క్లియర్‌ చేశాడు. అయితే అతను సివిల్స్‌ క్లియర్‌ చేసిన కొన్ని రోజులకే జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.

డెబ్యూ మ్యాచ్ శ్రీలంక‌తో...

దేశం కోసం ఆడాలన్న కల నిజం కావడంతో ఖురేషియా ఎగిరిగంతేశాడు. అలా 1999లో పెప్సీ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో(45 బంతుల్లో 57 పరుగులు) రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత అదే ఫామ్‌ను కంటిన్యూ చేయడంలో విఫలమైన ఖురేషియా మెల్లగా కనుమరుగయ్యాడు. అయితే అప్పటికే సివిల్స్‌ క్లియర్‌ చేయడంతో ఆటకు దూరమైనా తన రెండో కల(సివిల్స్‌)తో దేశానికి సేవ చేస్తున్నాడు.

చివ‌రి మ్యాచ్ శ్రీలంక‌తోనే...

ఓవరాల్‌గా టీమిండియా తరఫున 12 వన్డేలాడిన ఖురేషియా 149 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్‌ను శ్రీలంకపైనే ఆడాడు. మధ్యప్రదేశ్ తరఫున 119 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన ఖురేషియా 7 వేలకు పైగా పరుగులు చేశాడు. 22 ఏప్రిల్‌ 2007న ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top