శతకంతో రూట్‌ వేసి... | England 263 for 3 at stumps on Day 1 of first Test against India | Sakshi
Sakshi News home page

శతకంతో రూట్‌ వేసి...

Feb 6 2021 5:13 AM | Updated on Feb 6 2021 6:58 AM

England 263 for 3 at stumps on Day 1 of first Test against India - Sakshi

సిబ్లీ, రూట్‌ సెంచరీ సంబరం

తొలి వికెట్‌ 63 పరుగుల వద్ద పడింది. అదే స్కోరు వద్ద రెండో వికెట్‌ కూడా... భారత్‌ బౌలింగ్‌ బలగం ముందు ఇంగ్లండ్‌ కుప్పకూలిపోతుందేమో అనిపించింది. అయితే మూడో వికెట్‌ తీసేందుకు కోహ్లి సేన మరో 200 పరుగులు ఆగాల్సి వచ్చింది. కెప్టెన్‌ జో రూట్‌ సెంచరీతో ముందుండి నడిపించగా... ఓపెనర్‌ డామ్‌ సిబ్లీ అతడిని అనుసరించడంతో ‘చెపాక్‌’లో మొదటి రోజును ఇంగ్లండ్‌ సంతృప్తిగా ముగించగలిగింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ సమర్థతకు తోడు ఏమాత్రం బౌన్స్, స్పిన్‌ కనిపించని జీవంలేని పిచ్‌పై భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోవడం శుక్రవారం ఆటలో విశేషాలు. ఇంగ్లండ్‌ భారీ స్కోరుపై కన్నేయగా... మన బౌలర్లు ఎలా నిలువరిస్తారో, పిచ్‌ ఎలా స్పందిస్తుందనేది రెండో రోజు ఆసక్తికరం.   

చెన్నై: భారత పర్యటనను ఇంగ్లండ్‌ జట్టు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. ఎలాంటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా లేకుండా నేరుగా టెస్టు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ తొలి టెస్టు మొదటి రోజు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి 89.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. 100వ టెస్టు ఆడుతున్న కెప్టెన్‌ జో రూట్‌ (197 బంతుల్లో 128 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, 1 సిక్స్‌) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరో సెంచరీ సాధించాడు. అతనికి ఓపెనర్‌ డామ్‌ సిబ్లీ (286 బంతుల్లో 87; 12 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 200 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్లో సిబ్లీ వికెట్‌ తీసి భారత్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి.  

ఒకే స్కోరు వద్ద ఇద్దరు...
ఓపెనర్లు రోరీ బర్న్స్‌ (60 బంతుల్లో 33; 2 ఫోర్లు), సిబ్లీ తొలి వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌కు శుభారంభం అందించారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ కూడా ఆత్మవిశ్వాసంతో బౌలర్లను ఎదుర్కొన్నారు. బుమ్రా వేసిన తొలి బంతికే బర్న్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ జారవిడవడం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఎనిమిదో ఓవర్లోనే స్పిన్నర్‌ అశ్విన్‌ను బౌలింగ్‌కు దించినా భారత్‌కు వెంటనే ఫలితం దక్కలేదు. అయితే బ్యాట్స్‌మన్‌ స్వీయతప్పిదంతో భారత్‌ మొదటి వికెట్‌ సాధించింది. క్రీజ్‌లో చక్కగా నిలదొక్కుకున్న బర్న్స్‌... అశ్విన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడబోయి సునాయాస క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే బుమ్రా బౌలింగ్‌లో డాన్‌ లారెన్స్‌ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో భారత్‌ పైచేయి సాధించినట్లు కనిపించింది. అయితే రూట్, సిబ్లీ కలిసి ఇంగ్లండ్‌ రాత మార్చారు.    

భారీ భాగస్వామ్యం...
లంచ్‌ తర్వాత ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. భారత బౌలింగ్‌ను ఎలాంటి తడబాటు లేకుండా ఎదుర్కొన్న రూట్, సిబ్లీ చక్కటి షాట్లతో స్కోరు బోర్డును నడిపించారు. తొలిసారి భారత గడ్డపై ఆడుతున్న సిబ్లీ పట్టుదల కనబర్చగా... రూట్‌ తనదైన ట్రేడ్‌ మార్క్‌ స్వీప్‌ షాట్లతో పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 159 బంతుల్లో సిబ్లీ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ సెషన్‌లో భారత్‌కు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. టీ విరామం తర్వాత హాఫ్‌ సెంచరీ మార్క్‌ను దాటిన రూట్‌ ఆపై మరింత జోరును ప్రదర్శించాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పోటీ పడి ఆడటంతో చకచకా పరుగులు వచ్చాయి. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌ దిశగా సింగిల్‌ తీయడంతో రూట్‌ శతకం పూర్తయింది. అయితే దురదృష్టవశాత్తూ సిబ్లీ ఆ అవకాశం కోల్పోయాడు. తొలి రోజు చివరి ఓవర్‌ వేసిన బుమ్రా మూడో బంతికి సిబ్లీని ఎల్బీగా అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌ తీసిన సంతృప్తితో భారత్‌ రోజు ముగించింది. సిబ్లీ అవుటైన వెంటనే మరో మూడు బంతులు మిగిలి ఉన్నా అప్పటికే నిర్ణీత సమయం ముగియడంతో అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 33; సిబ్లీ (ఎల్బీ) (బి) బుమ్రా 87; లారెన్స్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 0; రూట్‌ (బ్యాటింగ్‌) 128; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (89.3 ఓవర్లలో 3 వికెట్లకు) 263.
వికెట్ల పతనం: 1–63, 2–63, 3–263.
బౌలింగ్‌: ఇషాంత్‌ 15–3–27–0, బుమ్రా 18.3 –2–40–2, అశ్విన్‌ 24–2–68–1, షాబాజ్‌ నదీమ్‌ 20–3–69–0, సుందర్‌ 12–0–55–0.

కెరీర్‌ 100వ టెస్టులో సెంచరీ సాధించిన 9వ బ్యాట్స్‌మన్‌
జో రూట్‌. గతంలో కొలిన్‌ కౌడ్రీ (ఇంగ్లండ్‌), జావేద్‌ మియాందాద్‌ (పాకిస్తాన్‌), గార్డన్‌ గ్రీనిడ్జ్‌ (వెస్టిండీస్‌), అలెక్‌ స్టివార్ట్‌ (ఇంగ్లండ్‌), ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ (పాకిస్తాన్‌), రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా), గ్రేమ్‌ స్మిత్, హాషిమ్‌ ఆమ్లా (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించగా...వీరిలో పాంటింగ్‌ ఒక్కడే తన వందో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాదాడు.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ తన తొలి టెస్టును (నాగ్‌పూర్‌–2012), 50వ టెస్టును (విశాఖపట్నం–2016), 100వ టెస్టును (చెన్నై–2021) భారత్‌పై భారత్‌లోనే ఆడటం విశేషం


బుమ్రాకు సహచరుల అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement