
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గాయాన్ని సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన పంత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు (67 ఇన్నింగ్స్‌ల్లో 2719 పరుగులు) చేసిన భారత ఆటగాడిగా అవతరించాడు.
ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్ శర్మ (69 ఇన్నింగ్స్‌ల్లో 2716 పరుగులు) పేరిట ఉండేది. పంత్ తాజాగా హిట్‌మ్యాన్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో పంత్ 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. మరో 17 పరుగులు జోడించి పెవిలియన్‌కు చేరాడు. బొటన వేలు గాయంతో బాధపడుతూనే పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. పంత్ వీరోచిత పోరాటానికి అందరూ సలాం కొడుతున్నారు.
పంత్ హాఫ్ సెంచరీకి చేరువలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఈ సిక్సర్‌తో పంత్ భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం పంత్, సెహ్వాగ్ టెస్ట్‌ల్లో తలో 90 సిక్సర్లతో ఉన్నారు.
హాఫ్ సెంచరీ పూర్తి కాగానే పంత్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ కొద్ది క్షణాల్లోనే ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, ఆర్చర్ 3, వోక్స్ డాసన్ తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.