Duleep Trophy 2023 Final: Pujara, Surya Fails; Priyank Keeps West Zone Hopes Alive - Sakshi
Sakshi News home page

Duleep Trophy: పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ప్రియాంక్‌! ఆశలు సజీవం..

Jul 15 2023 7:04 PM | Updated on Jul 15 2023 8:08 PM

Duleep Trophy Final: Pujara Surya Fails Priyank Keeps West Zone Hopes Alive - Sakshi

Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్‌ జోన్‌తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్‌ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్‌ జోన్‌ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా(15), సూర్యకుమార్‌ యాదవ్‌ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.

బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్‌ బ్యాటర్‌ ప్రియాంక్‌ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్‌ జోన్‌ను ఓడించి టైటిల్‌ గెలవాలంటే వెస్ట్‌ జోన్‌ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్‌ జోన్‌ ఆశలు  సజీవంగానే ఉన్నాయి. 

అయితే, ప్రియాంక్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్‌ జోన్‌ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్‌ జోన్‌ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్‌ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్‌ జోన్‌- సౌత్‌ జోన్‌ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్‌ ట్రోఫీ-2023 ఫైనల్‌ బుధవారం ఆరంభమైంది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్ట్‌ జోన్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌ జోన్‌ తిలక్‌ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.

ఇక వెస్ట్‌ జోన్‌ తరఫున ఓపెనర్‌ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన సౌత్‌ జోన్‌  230 పరుగులకు కథ ముగించింది.

ఈ క్రమంలో వెస్ట్‌ జోన్‌ టాప్‌ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్‌ గెలుస్తుంది. లేదంటే సౌత్‌ జోన్‌ ఈసారి చాంపియన్‌గా అవతరిస్తుంది.

చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్‌! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే..
అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement