
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (జులై 14) హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన టోర్నీ ఓపెనర్‌లో సౌతాఫ్రికా ఆతిథ్య జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది.
జార్జ్ లిండే (3-0-10-3), లుంగి ఎంగిడి (4-1-15-1), నండ్రే బర్గర్ (4-0-22-1), ఎన్ పీటర్ (3-0-22-1), కార్బిన్ బాష్ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి జింబాబ్వేను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు.
5 SIXES BY DEWALD BREVIS IN HIS RETURN TO T20I. 🤯🔥 pic.twitter.com/avZKMovpRj
— Johns. (@CricCrazyJohns) July 14, 2025
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. రజాతో పాటు బ్రియాన్ బెన్నెట్ (30), ర్యాన్ బర్ల్ (29) రెండంకెల స్కోర్లు చేశారు. మదెవెరె 1, క్లైవ్ మదండే 8, తషింగ ముసేకివ 9, మున్యోంగ 0, మసకద్జ 1 (నాటౌట్) పరుగుకు పరిమితమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. తొలి బంతికే చిచ్చరపిడుగు లుహాన్ డ్రి ప్రిటోరియస్ డకౌటైనా, రుబిన్ హెర్మన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్), డెవాల్డ్ బ్రెవిస్ (17 బంతుల్లో 41; ఫోర్, 5 సిక్సర్లు) సౌతాఫ్రికా విజయానికి పునాది వేశారు.
కార్బిన్ బాష్ (23 నాటౌట్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. అతనికి జార్జ్ లిండే (3 నాటౌట్) సహకరించాడు. సౌతాఫ్రికా 15.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన బ్రెవిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సౌతాఫ్రికా తరఫున అతనికి ఇదే తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ (11), కెప్టెన్ డస్సెన్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 3, ట్రెవర్ గ్వాండు 2 వికెట్లు తీశారు.
ఈ టోర్నీలో జింబాబ్వే, సౌతాఫ్రికా సహా న్యూజిలాండ్ కూడా పాల్గొంటుంది. తదుపరి మ్యాచ్ రేపు సాయంత్రం 4:30 గంటలకు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య హరారే వేదికగా జరుగనుంది.