DC vs CSK: ఢిల్లీ ‘టాప్‌’ గేర్‌.. చెన్నైపై విజయం

Delhi Capitals won by 3 wickets IPL 2021 - Sakshi

ఉత్కంఠ పోరులో చెన్నైకి చెక్‌ 

3 వికెట్లతో గెలిచిన క్యాపిటల్స్‌

దుబాయ్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆట చెదిరింది. అగ్ర స్థానం కూడా మారింది. ఇద్దరు సమఉజ్జీల మధ్య జరిగిన తక్కువ స్కోర్ల మ్యాచ్‌ ఆఖరికొచ్చేసరికి ఉత్కంఠను రేపింది. గతి తప్పిన బౌలింగ్‌తో చెన్నై మూల్యం చెల్లించుకోగా... ఢిల్లీ క్యాపిటల్స్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. అంబటి రాయుడు (43 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. ‘ప్లేయర్‌  ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌ (2/18) చెన్నైని దెబ్బ తీశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (18 బంతుల్లో 28 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును గెలిపించే ఆట ఆడారు.
 
బ్యాటింగ్‌ వైఫల్యంతో... 
ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్‌ నిరాశ పరిచింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (13), డుప్లెసిస్‌ (10) సహా రాబిన్‌ ఉతప్ప (19), మొయిన్‌ అలీ (5) పూర్తిగా నిరాశ పరిచారు. వీళ్లంతా 62 పరుగులకే పెవిలియన్‌ చేరిపోయారు. చప్పగా సాగిపోతున్న చెన్నై ఇన్నింగ్స్‌కు రాయుడు పెద్ద దిక్కయ్యాడు. కానీ అవతలి వైపు విశేష అనుభవజ్ఞుడైన కెప్టెన్‌ ధోని (27 బంతుల్లో 18) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. కష్టంగా 17వ ఓవర్లో చెన్నై స్కోరు వందకు చేరింది.  

ఢిల్లీ కూడా డీలా 
సునాయాస లక్ష్యమే అయినా ఢిల్లీ ఆటలేం సాఫీగా సాగలేదు. మూడు బౌండరీలు బాదిన పృథ్వీ షా (12 బంతుల్లో 18) ఎంతో సేపు నిలువలేదు. క్రీజులో నిలిచేందుకు తొలుత ఆపసోపాలు పడిన శిఖర్‌ ధావన్‌... ఐదో ఓవర్లో చెలరేగాడు. వరుసగా 6, 4, 4, 6 బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్‌కే కాదు... మొత్తం మ్యాచ్‌కే ఇది హైలైట్‌. కానీ శ్రేయస్‌ అయ్యర్‌ (2), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (15), రిపాల్‌ పటేల్‌ (18)లను చెన్నై బౌలర్లు తేలిగ్గానే బోల్తా కొట్టించడంతో ఢిల్లీ కూడా డీలాపడింది. అందరిలో బాగా ఆడుతున్న ధావన్‌ కూడా భారీ షాట్‌కు యత్నించి డగౌట్‌ చేరాడు. అశ్విన్‌ (2), అక్షర్‌ పటేల్‌ (5) ఔట్‌ కావడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. గౌతమ్‌ క్యాచ్‌ నేలపాలు చేయడంతో బతికిపోయిన హెట్‌మైర్‌ మరో పొరపాటు చేయకుండా మ్యాచ్‌ను గెలిపించాడు.


స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) అశ్విన్‌ (బి) నోర్జే 13; డుప్లెసిస్‌ (సి) శ్రేయస్‌ (బి) అక్షర్‌ 10; ఉతప్ప (సి) అండ్‌ (బి) అశ్విన్‌ 19; అలీ (సి) శ్రేయస్‌ (బి) అక్షర్‌ 5; రాయుడు నాటౌట్‌ 55; ధోని (సి) పంత్‌ (బి) అవేశ్‌ 18; జడేజా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 136. వికెట్ల పతనం: 1–28, 2–39, 3–59, 4–62, 5–132. బౌలింగ్‌: నోర్జే 4–0–37–1, అవేశ్‌ 4–0–35–1, అక్షర్‌ 4–0–18–2, రబడ 4–0–21–0, అశ్విన్‌ 4–0–20–1. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) డుప్లెసిస్‌ (బి) దీపక్‌ 18; ధావన్‌ (సి) అలీ (బి) శార్దుల్‌ 39; శ్రేయస్‌ (సి) రుతురాజ్‌ (బి) హాజల్‌వుడ్‌ 2; పంత్‌ (సి) అలీ (బి) జడేజా 15; రిపాల్‌ (సి) దీపక్‌ (బి) జడేజా 18; అశ్విన్‌ (బి) శార్దుల్‌ 2; హెట్‌మైర్‌ నాటౌట్‌ 28; అక్షర్‌ (సి) అలీ (బి) బ్రావో 5; రబడ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–24, 2–51, 3–71, 4–93, 5–98, 6–99, 7–135. బౌలింగ్‌: దీపక్‌ 3–0–34–1, హాజల్‌వుడ్‌ 4–0–27–1, జడేజా 4–0–28–2, అలీ 3–0–16–0, శార్దుల్‌ 4–0–13–2, బ్రావో 1.4–0–20–1. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top