వారెవ్వా మిల్లర్‌.. ఆరోజు ఏడ్చి.. ఈరోజు న‌వ్వి! | Delhi Capitals Batter David Miller Played Key Role In RCB Match | Sakshi
Sakshi News home page

వారెవ్వా మిల్లర్‌.. ఆరోజు ఏడ్చి.. ఈరోజు న‌వ్వి!

Apr 18 2026 8:16 PM | Updated on Apr 18 2026 10:01 PM

Delhi Capitals Batter David Miller Played Key Role In RCB Match

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టిన మ్యాచ్ అది. కేవ‌లం ఒక్క ప‌రుగుతో గుజ‌రాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓడిపోవ‌డానికి డేవిడ్ మిల్ల‌ర్ ప్ర‌ధాన కార‌ణ‌మయ్యాడు. ఆఖ‌రి బంతికి రెండు పరుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో అన‌వ‌స‌ర ఒత్తిడికి పోయిన మిల్ల‌ర్ ఢిల్లీకి చేజేతులా ఓట‌మిని అందించాడు. 

ఈ చ‌ర్య మిల్ల‌ర్‌ను కంట‌త‌డి పెట్టేలా చేసింది. మ‌రో అవ‌కాశం వ‌స్తే ఢిల్లీకి విజ‌యాన్ని అందించి త‌న త‌ప్పును స‌రిదిద్దుకుంటాన‌ని మిల్ల‌ర్ పేర్కొన్నాడు. అయితే త‌న త‌ప్పు స‌రిదిద్దుకునే రోజు ఇంత తొంద‌ర‌గా వ‌స్తుంద‌ని బ‌హుశా మిల్ల‌ర్ కూడా ఊహించి ఉండ‌డు. ఇవాళ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన‌ మ్యాచ్‌ మ‌రోసారి ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లింది. 

176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆఖ‌రి ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. క్రీజులో మిల్ల‌ర్‌తో పాటు స్ట‌బ్స్ ఉన్నాడు. తొలి బంతికి మిల్ల‌ర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి స్ట‌బ్స్ సింగిల్ తీశాడు. ఇక 4 బంతుల్లో 13 ప‌రుగులు అవ‌స‌రం. స్ట్రైక్‌లో ఉన్న మిల్ల‌ర్ ఈసారి ఢిల్లీని గెలిపించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. 

షెప‌ర్డ్ వేసిన మూడో బంతిని మిల్ల‌ర్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. ఇక మ‌రుస‌టి బంతిని ఈసారి మిల్ల‌ర్ ఎక్స్‌ట్రా క‌వ‌ర్స్ మీదుగా మ‌రో సిక్స‌ర్ సంధించాడు. దీంతో స‌మీక‌ర‌ణం రెండు బంతుల్లో ఒక ప‌రుగుకు మారిపోయింది. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో చేసిన పొర‌పాటును మ‌ళ్లీ చేయ‌కుండా షెప‌ర్డ్ వేసిన ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్ దిశ‌గా బౌండ‌రీ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. 

మొత్తం మీద గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి తానే కారణమని ఏడ్చిన మిల్లర్ ఇవాళ మాత్రం తన జట్టును గెలిపించి లెక్క సరిచేశాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 63, టిమ్ డేవిడ్ 26 పరుగులు చేశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 

చదవండి: సీఎస్‌కే కొత్త కెప్టెన్ సంజూ శాంస‌న్‌!

Advertisement
 
Advertisement
Advertisement