క్రికెట్ దేవుడి కోసం.. యుద్ధం చేసిన టీమిండియా | On This Day: India end 28-year wait, lift 2011 ODI World Cup at Wankhede | Sakshi
Sakshi News home page

2011 ODI WC: క్రికెట్ దేవుడి కోసం.. యుద్ధం చేసిన టీమిండియా

Apr 2 2026 1:20 PM | Updated on Apr 2 2026 1:50 PM

On This Day: India end 28-year wait, lift 2011 ODI World Cup at Wankhede

ఏప్రిల్ 2.. ఈ తేదీకి భార‌త క్రికెట్ చ‌రిత్రలో ప్రత్యేకమైన స్ధానం ఉంది. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఇదే రోజున 28 ఏళ్ల సుదీర్ఘ‌ నిరీక్షణకు తెర‌దించుతూ రెండో వ‌న్డే ప్రపంచ‌క‌ప్ టైటిల్‌ను భార‌త్ ముద్దాడింది. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని టీమిండియా వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో శ్రీలంక‌ను మ‌ట్టికరిపించి 2011 వన్డే ప్రపంచకప్ విజేత‌గా నిలిచింది. 

గంభీర్ అద్భుత పోరాటం, ధోని సిక్స్ కొట్టి గెలిపించిన ఆ ఆపురూప క్ష‌ణాలు అభిమానుల క‌ళ్ల ముందు ఇప్ప‌టికీ తిరుగుతూ ఉన్నాయి. భార‌త్ ఈ చారిత్ర‌త్మక విజ‌యం సాధించి నేటికి 15 ఏళ్లు. ఈ సంద‌ర్భంగా ఫైన‌ల్ మ్యాచ్ హైలెట్స్‌ను మ‌రోసారి గుర్తు చేసుకుందాం.

ఆఖరి పోరులో అదరహో
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఫైనల్ పోరులో భారత్‌, శ్రీలంక తలపడ్డాయి. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో మహేల జయవర్ధనే అద్భుతమైన సెంచరీతో (88 బంతుల్లో 103 నాటౌట్) మెరిశాడు. అతడికి కుమార సంగక్కర(48 పరుగులు) సహకరం అందించాడు.

భారత బౌలర్లలో జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొదటి ఓవర్‌లోనే డేంజరస్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (0)ను లంక పేసర్ లసిత్ మలింగ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(18) కూడా వికెట్ల వెనుక దొరికిపోయాడు. దీంతో ఒక్కసారిగా వాంఖడే మైదానం మొత్తం సైలెంట్ అయిపోయింది.

గంభీర్ విరోచిత పోరాటం
ఈ సమయంలో గౌతమ్ గంభీర్ తన విరోచిత పోరాటంతో జట్టును అదుకున్నాడు. యువ ఆటగాడు విరాట్ కోహ్లితో కలిసి మూడో వికెట్‌కి 83 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 35 పరుగులు చేసిన కోహ్లి దిల్షాన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లి ఔటయ్యాక యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కు వస్తాడని అంతా భావించారు. ఎందుకంటే నంబర్ 4 అనేది యువీ స్ధానమే.

కానీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ యువరాజ్ కంటే ముందే క్రీజులోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే అతడు ఎందుకు ముందుగా బ్యాటింగ్‌కు వచ్చాడో కాసేపటికే అందరికి ఆర్ధమైపోయింది. టీ20ను తలపించేలా బ్యాటింగ్ చేసిన ధోని.. గంభీర్‌తో కలిసి జట్టును విజయం వైపు తీసుకెళ్లాడు. వాంఖ‌డే మైదానంలో బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు.

విజ‌యానికి చేరువ‌లో గంభీర్‌(122 బంతుల్లో 97) ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన యువ‌రాజ్ కూడా కాస్త దూకుడుగా ఆడాడు. అయితే 48 ఓవ‌ర్‌లో రెండో బంతికి సిక్స్ కొట్టిన ధోని.. త‌న జ‌ట్టును విశ్వ‌విజేత‌గా నిలిపాడు. ధోని త‌న స్టైల్లో సిక్స్ కొట్ట‌గానే వాంఖ‌డే స్టేడియం ద‌ద్ద‌రిల్లిపోయింది. జ‌ట్టులోని ప్ర‌తీ ఒక్క‌రూ భావోద్వేగానికి లోన‌య్యారు.

స‌చిన్‌కు అంకితం
వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన  తర్వాత ఆటగాళ్లందరూ సచిన్ టెండూల్కర్‌ను భుజాలపై ఎత్తుకుని స్టేడియం అంతా తిరిగారు. "స‌చిన్ 21 ఏళ్లే దేశం ప‌రువు, ప్ర‌తిష్ట‌ను మోశారు. ఇప్పుడు ఆయన్ని మోసే సమయం వచ్చింది" అని ఆ సమయంలో కోహ్లి అన్నాడు. ఫైనల్లో విఫలమైనప్పటికి టోర్నీ అసాంతం సచిన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో 85 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 

మొత్తంగా 482 పరుగులతో టోర్నీలో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా మాస్టర్ బ్లాస్టర్‌ నిలిచాడు. సచిన్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించినా.. ఆ ప్రపంచకప్ విజయం ఆయనకు ఎంతో స్పెషల్‌. వరల్డ్‌కప్ గెలిచి 15 ఏళ్ల పూర్తియిన సందర్భంగా అప్పటి భావోద్వేగ క్షణాలను సచిన్ గుర్తు చేసుకున్నాడు.

మొదటి బంతి ఎప్పుడూ గుండె వేగాన్ని పెంచుతుంది. కానీ ఆ రాత్రి, ఆ వేగం అస్సలు తగ్గలేదు. 15 ఏళ్లు గడిచినా, ఆ జ్ఞాపకాలు, భావోద్వేగ క్షణాలు మాతో ఉన్నాయి. యువ క్రికెటర్లగా ఉన్నప్పటి నుంచే భారత తరపున వరల్డ్‌కప్ గెలవాలని కలలు కన్నాము. ఆ కల నా కెరీర్ ఆఖరిలో నెరవేరింది. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ, అభిమానులందరికీ ధన్యవాదాలు. జై హింద్ అని తన ఎక్స్ ఖాతాలో సచిన్ పోస్ట్ చేశాడు.

యువీ ఆల్‌రౌండ్ షో..
కాగా 28 ఏళ్ల భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 362 పరుగులతో పాటు 15 వికెట్లు తీశాడు. ఈ పంజాబీ క్రికెటర్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement