42 మ్యాచ్‌ల వరకు ఒక్కసారి కూడా లేదు.. ఆతర్వాత వరుసగా 3 సార్లు 'ఆ ఘనత'

CWC Qualifier 2023: Hasaranga Picked 26 Wickets In Last 7 ODIs - Sakshi

శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగ ఇటీవలికాలంలో బంతితో పేట్రేగిపోతున్నాడు. వికెట్లకు మినిమం గ్యారెంటీగా మారిపోయాడు. మ్యాచ్‌లో కనీసం 2 వికెట్లయినా పడగొడుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న హసరంగ.. ఇటీవల వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్ల ఘనత సాధించి, దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ రికార్డు సమం చేశాడు. 

ఈ క్రమంలో హసరంగ వన్డే కెరీర్‌కు సంబంధించిన బౌలింగ్‌ గణంకాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కెరీర్‌లో ఇప్పటివరకు 46 వన్డేలు ఆడిన హసరంగ.. తొలి 39 మ్యాచ్‌ల్లో కేవలం 39 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అప్పటివరకు సాధారణ బౌలర్‌లా ఉన్న హసరంగ ఒక్కసారిగా ప్రపంచ స్థాయి బౌలర్‌గా మారిపోయాడు. తదుపరి ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 26 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 ఐదు వికెట్లు ఘనతలు, ఆతర్వాత వరుసగా 2 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు, అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 2 వికెట్లు పడగొట్టాడు. 

హసరంగ చెలరేగుతుండటంతో వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో శ్రీలంక వరుసగా విజయాలు సాధిస్తూ.. వరల్డ్‌కప్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో హసరంగ 5 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. 

గత 7 మ్యాచ్‌ల్లో హసరంగ గణాంకాలు..

  • నెదర్లాండ్స్‌పై 9-2-42-3
  • స్కాట్లాండ్‌పై 4.2-1-7-3
  • ఐర్లాండ్‌పై 8-1-24-6
  • ఒమన్‌పై 7.2-2-13-5
  • యూఏఈపై 10-0-79-5
  • ఆఫ్ఘనిస్తాన్‌పై 6-0-42-2
  • ఆఫ్ఘనిస్తాన్‌పై 10-0-53-2
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top