హార్దిక్‌ రికార్డు బద్దలు కొట్టిన కమిన్స్‌ | Cummins Creates History Breaks Hardik Record Becomes 1st Pacer To | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ రికార్డు బద్దలు కొట్టిన కమిన్స్‌

May 19 2026 2:10 PM | Updated on May 19 2026 3:46 PM

Cummins Creates History Breaks Hardik Record Becomes 1st Pacer To

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌ హోదాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేస్‌ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌ మాజీ కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ ప్రస్తుత సారథి హార్దిక్‌ పాండ్యా పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.

వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియా టెస్టు సారథి కమిన్స్‌ (Pat Cummins).. ఐపీఎల్‌-2026 ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. అతడి గైర్హాజరీలో ఇషాన్‌ కిషన్‌ జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలిపాడు.

మూడు కీలక వికెట్లు పడగొట్టి
ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో ఏప్రిల్‌ 25 నాటి మ్యాచ్‌ సందర్భంగా కమిన్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ అలరించిన కమిన్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సోమవారం నాటి కీలక మ్యాచ్‌లో అద్భుత రీతిలో రాణించాడు.

చెపాక్‌ వేదికగా చెన్నై ఓపెనర్లు సంజూ శాంసన్‌ (27), కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (15)లతో పాటు.. మరో కీలక బ్యాటర్‌ కార్తిక్‌ శర్మ (32) రూపంలో మూడు వికెట్లు పడగొట్టాడు కమిన్స్‌. తద్వారా ఈ సీజన్‌లో ఇప్పటికి ఆరు మ్యాచ్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

హార్దిక్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు
ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా ఆల్‌టైమ్‌ రికార్డును కమిన్స్‌ బద్దలు కొట్టాడు. కెప్టెన్‌ హోదాలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ ఐపీఎల్‌లో ఇప్పటికి.. 40 వికెట్లు తీయగా.. కమిన్స్‌ తాజాగా అతడిని అధిగమించాడు. అంతేకాదు ఈ సందర్భంగా టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు.

ఇదిలా ఉంటే.. సారథిగా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆసీస్‌ దివంగత స్పిన్‌ దిగ్గజం, రాజస్తాన్‌ రాయల్స్‌ మాజీ కెప్టెన్‌ షేన్‌ వార్న్‌ కొనసాగుతున్నాడు. ఇక చెన్నైని ఐదు వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్‌.. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.

ఐపీఎల్‌లో కెప్టెన్‌ హోదాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
👉షేన్‌ వార్న్‌ (స్పిన్నర్‌)- రాజస్తాన్‌ రాయల్స్‌- 55 మ్యాచ్‌లలో 58 వికెట్లు
👉ప్యాట్‌ కమిన్స్‌ (పేసర్‌)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 36 మ్యాచ్‌లలో 42 వికెట్లు
👉హార్దిక్‌ పాండ్యా (పేసర్‌)- గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌- 68 మ్యాచ్‌లలో 40 వికెట్లు
👉అనిల్‌ కుంబ్లే (స్పిన్నర్‌)- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 26 మ్యాచ్‌లలో 30 వికెట్లు
👉రవిచంద్రన్‌ అశ్విన్‌ (స్పిన్నర్‌)- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (పంజాబ్‌ కింగ్స్‌)- 28 మ్యాచ్‌లలో 20 వికెట్లు.

చదవండి: సంజూను అసభ్యంగా దూషించిన క్లాసెన్‌!.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement