‘నేను క్రెడిట్‌ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్‌’ | CSK Captain Ruturaj Gaikwad Winning Comments I Wont Take Credit | Sakshi
Sakshi News home page

‘నేను క్రెడిట్‌ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్‌’

May 3 2026 9:19 AM | Updated on May 3 2026 7:15 PM

CSK Captain Ruturaj Gaikwad Winning Comments I Wont Take Credit

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ త‌మ ప్లేఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ అజేయ అర్థ‌సెంచ‌రీ సాధించి జ‌ట్టును గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన‌ కార్తిక్ శ‌ర్మ కూడా అజేయ హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 

సీజ‌న్‌లో నాలుగో విజ‌యం అందుకున్న సీఎస్‌కే 8 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో ఉంది.  మ్యాచ్ ముగిసిన అనంత‌రం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. నిజానికి ఈ మ్యాచ్ విన్నర్ తాను కాదని, ఇంపాక్ట్‌గా వచ్చి అజేయ అర్థసెంచరీతో అదరగొట్టిన కార్తిక్ శర్మకు క్రెడిట్ ఇవ్వాలని రుతురాజ్ తెలిపాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పాడు. 

రుతురాజ్‌ మాట్లాడుతూ..'చాలా సంతోషంగా ఉంది. మేం మొదట బాగానే ప్రారంభించాం. కానీ మధ్యలో ముంబై ఇండియన్స్ పుంజు కుంది. అయితే మేం మళ్లీ మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. మొదటి కొన్ని ఓవర్లను తట్టుకుని నిలబడటం.. ఆపై టాప్ త్రీ బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఉండటం కీలకమని మేం భావించాం. ఇక అన్షుల్‌ కంబోజ్‌ చాలా నిలకడగా రాణిస్తున్నాడు. తన ప్రక్రియను అనుసరిస్తున్నాడు. అతని ఆలోచనా తీరు ఒక బ్యాటర్ లాగా ఉంటుంది. 

నూర్ కూడా కొన్ని మార్పులు చేసుకుని బాగా రాణిస్తున్నాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే అఖీల్ హుస్సేన్‌ను ఆడించలేదు. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని, అదనపు బౌలర్ ఉండాలని ఆలోచించాం. ప్రశాంత్ వీర్, ఘోష్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలరు. మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ చెబుతున్నట్లుగా.. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. 

అయితే ఇది టీ20 క్రికెట్. సరైన సమయం కోసం వేచి చూశాను. కార్తీక్ శర్మకు ఈ ఇన్నింగ్స్ మంచి బూస్ట్‌లాంటిది. అతను సిక్సర్లు కొట్టగలడు. కానీ అతను బంతులను ఎంచుకొని ఆడిన తీరు బాగుంది. అతను ఫామ్ కొనసాగిస్తే జట్టుకు ప్రయోజనం. మేం ఆటను చాలా సింపుల్‌గా ఉంచుతున్నాం. తప్పులు జరుగుతుంటాయి కానీ బలంగా తిరిగి రావాలి. ఈ జెర్సీ, అభిమానుల కోసం మా సర్వస్వం ఇస్తాం.’ అని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

చదవండి: ముంబై ఇండియ‌న్స్ ప్రపంచ రికార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement