Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఐవోసీ ఆమోదం

Crickets inclusion in Los Angeles 2028 Olympic Games approved by IOC Session in Mumbai - Sakshi

లాస్‌ ఏంజెలిస్‌–2028 విశ్వ క్రీడల్లో పునరాగమనం

టి20 ఫార్మాట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో నిర్వహణ

స్క్వాష్, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌ క్రీడాంశాలకు తొలిసారి చోటు

మళ్లీ బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్, లాక్రాస్‌ క్రీడాంశాలకు స్థానం 

ఐఓసీ సెషన్స్‌లో ఆమోద ముద్ర

ముంబై: లాంఛనం ముగిసింది. ఎట్టకేలకు క్రికెట్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో పునరాగమనం చేయనుంది. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌తోపాటు స్క్వా‹Ù, బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్, లాక్రాస్‌ (సిక్స్‌–ఎ–సైడ్‌), ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌ క్రీడాంశాలను కొత్తగా చేర్చారు. ఐదు కొత్త క్రీడాంశాలకు లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో అనుమతి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చేసిన ప్రతిపాదనలకు సోమవారం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యులు ఓటింగ్‌ ద్వారా ఆమోదం తెలిపినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌ ప్రకటించారు. 99 మంది ఐఓసీ సభ్యుల్లో ఇద్దరు మాత్రమే ఈ ఐదు క్రీడాంశాల ప్రతిపాదనను వ్యతిరేకించగా... 97 మంది సమ్మతించారు. లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఈవెంట్‌ను టి20 ఫార్మాట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల మధ్య నిర్వహిస్తారు. ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా మిగతా ఐదు జట్లను నిర్ణయించే అవకాశముంది.  

► 1877లో క్రికెట్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ జరిగింది. 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఒకే ఒకసారి క్రికెట్‌ మెడల్‌ ఈవెంట్‌గా ఉంది. పారిస్‌ గేమ్స్‌లో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్‌ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. బ్రిటన్‌ జట్టుకు స్వర్ణం, ఫ్రాన్స్‌ జట్టుకు రజతం లభించాయి. ఆ తర్వాత క్రికెట్‌ విశ్వ క్రీడల జాబితాలో చోటు కోల్పోయింది. టెస్టు, వన్డే ఫార్మాట్‌ల బదులు మూడు, నాలుగు గంటల్లో ఫలితం వచ్చే టి20 ఫార్మాట్‌ రాకతో క్రికెట్‌ స్వరూపమే మారిపోయింది. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్‌లు ఎంతోమంది క్రికెటర్లకు కొత్తగా అవకాశాలు కలి్పస్తుండటంతోపాటు ఆరి్థకంగా వారిని ఆదుకుంటున్నాయి. ప్రస్తుతం ఫుట్‌బాల్‌ తర్వాత ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడగా క్రికెట్‌కు గుర్తింపు వచ్చింది. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్‌ ఒలింపిక్స్‌లో పునరాగమనం చేయనుంది.  

► ప్రస్తుతానికి క్రికెట్‌తోపాటు మిగతా నాలుగు కొత్త క్రీడాంశాలు లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ వరకే పరిమితం కానున్నాయి. తదుపరి ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ క్రికెట్‌ కొనసాగడమనేది ఆయా దేశాల కార్యనిర్వాహక కమిటీల ఆసక్తిపై ఆధారపడి ఉంది. ఐఓసీ నిబంధనల ప్రకారం ఒలింపిక్స్‌ క్రీడల ఆతిథ్య దేశానికి తమకు నచి్చన కొన్ని క్రీడాంశాలను అదనంగా చేర్చే వెసులుబాటు ఉంది. 2032
ఒలింపిక్స్‌ ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌ నగరంలో జరుగుతాయి. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి భారత్‌ ఆసక్తి కనబరుస్తోంది. ఆ్రస్టేలియా, భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉండటంతో 2032, 2036 ఒలింపిక్స్‌ల్లోనూ క్రికెట్‌ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
 
► ‘విశ్వవ్యాప్తంగా 2.5 బిలియన్‌ అభిమానులు కలిగిన ప్రపంచంలోని రెండో అత్యధిక ఆదరణ కలిగిన క్రికెట్‌ క్రీడను ఒలింపిక్స్‌లోకి స్వాగతం పలుకుతున్నాం. అమెరికాలోనూ మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ ద్వారా ఈ ఆటకు ఆదరణ పెరుగుతోంది. వచ్చే ఏడాది అమెరికా–వెస్టిండీస్‌ సంయుక్తంగా టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నా మిత్రుడు విరాట్‌ కోహ్లికి సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా 340 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాస్కెట్‌బాల్‌ దిగ్గజం లేబ్రాన్‌ జేమ్స్, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ టామ్‌ బ్రేడీ, గోల్ఫ్‌ స్టార్‌ టైగర్‌ వుడ్స్‌కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కోహ్లికి ఉన్నారు. అందుకే క్రికెట్‌ కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందాలనే ఉద్దేశంతో ఒలింపిక్స్‌లో చోటు కల్పిస్తున్నాం’ అని లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ స్పోర్ట్స్‌ డైరెక్టర్, ఒలింపిక్‌ చాంపియన్‌ షూటర్‌ నికోలో కాంప్రియాని వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌కు చోటు లభించడంపట్ల ఐఓసీ సభ్యురాలు, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ శాశ్వతంగా కొనసాగేందుకు తమవంతుగా అన్ని చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) చైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే తెలిపారు.  
 
► రగ్బీ తరహాలో ఆడే ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌కు... స్వా్వష్‌కు ఒలింపిక్స్‌లో తొలిసారి స్థానం దక్కింది. బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్‌కు వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో చోటు దక్కకపోయినా... అమెరికాలో ఎంతో ప్రాచుర్యం ఉండటంతో బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్‌ లాస్‌ ఏంజెలిస్‌లో మళ్లీ కనిపిస్తాయి.  

► హాకీ తరహాలో ఆడే లాక్రాస్‌ క్రీడాంశం 1904 సెయింట్‌ లూయిస్‌ ఒలింపిక్స్‌లో, 1908 లండన్‌ ఒలింపిక్స్‌లో మెడల్‌ ఈవెంట్‌గా ఉంది. ఆ తర్వాత 1928 అమ్‌స్టర్‌డామ్, 1932 లాస్‌ ఏంజెలిస్, 1948 లండన్‌ ఒలింపిక్స్‌లో ప్రదర్శన క్రీడగా కొనసాగి ఆ తర్వాత చోటు కోల్పోయింది.
చదవండి: WC 2023: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? అతడికి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top