అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఊహకందని ఓ అద్భుతం జరిగింది. మహిళల విభాగంలో ఓ బౌలర్ ఏకంగా 9 వికెట్లు తీసి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కలహరి మహిళల టీ20 టోర్నీ-2026లో భాగంగా లెసోథోతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ బౌలర్ లారా కార్డోసో ఈ చారిత్రక ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన ఆమె.. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి, ఓ హ్యాట్రిక్ సహా 9 వికెట్లు పడగొట్టింది. ఫలితంగా 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లెసోథో జట్టు 13 పరుగులకే ఆలౌటై (6.2 ఓవర్లలో), 190 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయంపాలైంది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో లారా కార్డోసో నమోదు చేసిన ఈ గణాంకాలు (3-0-4-9) ఏ విభాగంలో (పురుషులు, మహిళల) అయినా అత్యుత్తమంగా నిలిచిపోనున్నాయి. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు భూటాన్ బౌలర్ సోనమ్ యెషే పేరిట ఉండేవి. గతేడాది డిసెంబర్‌లో మయన్మార్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో యెషే కేవలం 7 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు.


