చిట్టివలస టూ అమెరికా.. రూ. కోటి ఉపకారవేతనంతో రేష్మ ఎంపిక

Challarapu Reshma Selected Lindsey Wilson College Tennis Practice Vizag - Sakshi

చిట్టివలసలో అధునాతన వసతులతో స్పోర్ట్స్‌ విలేజ్‌ 

ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులకు అమెరికాకు చెందిన

నాలుగు స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయాలతో కాంట్రాక్ట్‌ 

తగరపువలస (భీమిలి)/విశాఖపట్నం: చిట్టివలస శివారులో అధునాతన వసతులతో ద్రోణాచార్య స్పోర్ట్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ విలేజీ నిర్మాణం జోరందుకుంది. నగరానికి చెందిన వైద్యులు సీహెచ్‌ శ్రీనివాసరావు, రమణ, ఉపాధ్యాయుడు శ్రీనివాసరాజు, వ్యాపారవేత్త ప్రకాష్‌లు సంయుక్తంగా పది ఎకరాలలో దీనిని నిర్మిస్తున్నారు. 4,5,6,7 తరగతులు చదువుతున్న విద్యార్థులు 120 మందితో ఇంటర్‌ వరకు విద్యతో పాటు ప్రొఫెషనల్‌ క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో ఎండాడ, పీఎం పాలెంలలో చిన్న అకాడమీలను నడిపిన అనుభవంతో ఈ పెద్ద ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇందుకు గాను అమెరికాకు చెందిన నాలుగు స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయాలతో అవగాహన కుదుర్చుకున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులను అమెరికాలో టెన్నిస్, క్రికెట్‌లో ఆడుతూ ఉపాధి పొందే దిశగా మూడేళ్ల కాంట్రాక్ట్‌తో పంపించనున్నారు. 

చిట్టివలస శివారులో రూపొందుతున్న స్పోర్ట్స్‌ విలేజ్‌

ప్రొఫెషనల్స్‌తో శిక్షణ 
స్పోర్ట్స్‌ విలేజ్‌లో క్రికెట్, టెన్నిస్‌కు ఆట స్థలాలు సిద్ధంగా కాగా సంక్రాంతి తరువాత నుంచి బాడ్మింటన్, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్, స్విమ్మింగ్‌పూల్, వ్యాయామశాల, అథ్లెటిక్‌ల కోసం 220 మీటర్ల ట్రాక్‌ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. మార్చి నుంచి పూర్తి స్థాయిలో స్పోర్ట్స్‌ విలేజ్‌లో సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. క్రీడలలో శిక్షణతో పాటు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారు చేసేందుకుగాను అనుబంధంగా కేరళ నుంచి ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాల నుంచి  కోచ్‌లు, డైటిషియన్, ఫిజయోథెరపిస్ట్‌లు, వార్డెన్లను అందుబాటులో ఉంచుతారు. 

స్పోర్ట్స్‌ విలేజ్‌లో తరగతి గదులు

రూ. కోటి ఉపకారవేతనంతో రేష్మ ఎంపిక 
స్పోర్ట్స్‌ విలేజీకు నగరానికి చెందిన చల్లారపు రేష్మ అనే విద్యార్థిని ఏడాది క్రితం అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన లిండ్సే విల్సన్‌ కళాశాలకు రూ.కోటి ఉపకార వేతనంతో ఎంపికయింది. ఈమె గతంలో ఇంటర్మీడియట్‌ చదువుతుండగా టెన్నిస్‌లో నేషనల్‌ గోల్డ్‌మెడల్, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన పోటీలలో గోల్డ్, సిల్వర్‌ పతకాలు వరుసగా రెండేళ్లు గెలుచుకుంది. ఐసీఎస్‌ఈ నిర్వహించిన టెన్నిస్‌ పోటీలలో కూడా గోల్డ్‌ మెడల్‌ సాధించింది. 

            స్పోర్ట్స్‌ విలేజ్‌లో క్రికెట్‌ స్టేడియమ్‌

ప్రొఫెషనల్‌ క్రీడాకారిణిగా ఎదగాలని
ఏడాదికి 3 వేల డాలర్ల ఉపకార వేతనంతో లిండ్సే విల్సన్‌ కళాశాలలో నాలుగేళ్ల టెన్నిస్‌ కోర్సు శిక్షణకు ఎంపికయ్యాను. ఇంకా మూడేళ్ల శిక్షణ ఉంది. తరువాత ఉమెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ద్వారా అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొవాలనేది లక్ష్యం. చివరిగా ఇక్కడి స్పోర్ట్స్‌ విలేజ్‌లో టెన్నిస్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా మరింత మందిని తయారు చేస్తాను. –చల్లారపు రేష్మ

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చవచ్చు.. 
ప్రస్తుతం అమెరికాలో టెన్నిస్‌కు ఆదరణ చాలా బాగుంది. రానున్న రోజులలో అక్కడ క్రికెట్‌పై బాగా దృష్టి సారించనున్నారు. రానున్న కాలంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే అవకాశం ఉంది. మా దగ్గర చేరే పరిమితమైన విద్యార్థులకు విద్యతో పాటు వారికి ఇష్టమైన క్రీడలలో తరీ్ఫదు ఇచ్చి నేరుగా అమెరికాలో ఆడుతూ ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తున్నాం. ప్రొఫెషనల్‌ క్రీడాకారుల తయారీ లక్ష్యంగా ఈ విలేజ్‌ను ఏర్పాటు చేశాం.  –డి.ప్రకాష్‌, వ్యవస్థాపక భాగస్వామి

స్పోర్ట్స్‌ విలేజ్‌ నుంచి అమెరికాలో కెంటకీ రాష్ట్రంలో లిండ్సే విల్సన్‌ కళాశాలలో రూ.కోటి ఉపకారవేతనంతో టెన్నిస్‌ శిక్షణకు ఎంపికైన రేష్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top