కరోలినా మారిన్‌ వీడ్కోలు | Carolina Marin bids farewell to badminton | Sakshi
Sakshi News home page

కరోలినా మారిన్‌ వీడ్కోలు

Mar 27 2026 2:59 AM | Updated on Mar 27 2026 2:59 AM

Carolina Marin bids farewell to badminton

బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పిన స్పెయిన్‌ స్టార్‌  

మాడ్రిడ్‌: బ్యాడ్మింటన్‌కు అంతగా ఆదరణ లేని దేశం నుంచి వచ్చి... ప్రపంచ బ్యాడ్మింటన్‌నే శాసించి... ఈ ఆటలో మేటి అయిన ఆసియా దేశాల షట్లర్లనే హడలెత్తించి... అసాధారణ విజయాలతో అందర్నీ అబ్బురపరిచి... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న స్పెయిన్‌ స్టార్‌ కరోలినా మారిన్‌ ‘రాకెట్‌’ వదిలేసింది. మోకాలి గాయాలతో సతమతమవుతున్న తాను మరింత రిస్క్‌ తీసుకోలేనని చెబుతూ గురువారం బ్యాడ్మింటన్‌ నుంచి మారిన్‌ వీడ్కోలు తీసుకుంది. 

‘నా ప్రయాణం ఇక్కడితో ముగిసింది. వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే యూరోపియన్‌ చాంపియన్‌ షిప్‌లో నేను బరిలోకి దిగడంలేదు. చివరిసారి అందరినీ బ్యాడ్మింటన్‌ కోర్టులో కలవాలనుకున్నా. అయితే దీనికోసం నా శరీరాన్ని ప్రమాదంలో పడేయదల్చుకోలేదు. గతంలోనూ చాలాసార్లు చెప్పాను. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. నా కెరీర్‌ను విభిన్నంగా ముగించాలని భావించా. కానీ కొన్నిసార్లు జీవితంలో అన్ని అనుకున్నట్లు జరగవు. దీనిని అంగీకరించాల్సిందే. 

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆడిన కాంస్య పతక మ్యాచే నా కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా నిలిచింది. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచి, నా పట్ల అపరిమిత అభిమానాన్ని చూపిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ఆటలో నేను సాధించిన విజయాలకు గర్వపడుతున్నా. కేవలం టైటిల్స్‌తోనే కాకుండా ఇంటాబయటా గౌరవాన్ని పొందాను’ అని గురువారం సోషల్‌ మీడియాలో మారిన్‌ వీడ్కోలు వీడియోను విడుదల చేసింది.  

2009లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అడుగు పెట్టిన మారిన్‌ 2015 ఏప్రిల్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఓవరాల్‌గా తన కెరీర్‌లో ఆమె 100 వారాలపాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగింది. 2016 రియో ఒలింపిక్స్‌ ఫైనల్లో భారత స్టార్‌ పీవీ సింధును ఓడించి స్వర్ణ పతకం నెగ్గిన మారిన్‌... 2015 ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన మరో స్టార్‌ సైనా నెహ్వాల్‌పై గెలిచింది. 

అంతేకాకుండా 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌పై... 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో పీవీ సింధుపై గెలిచి మారిన్‌ విశ్వవిజేతగా నిలిచింది. ముఖ్యంగా సింధు, సైనాలకు మారిన్‌ కొరకరాని ప్రత్యర్థి అంటే అతిశయోక్తి కాదు. సింధుతో 18 సార్లు ఆడిన మారిన్‌ 12 సార్లు గెలిచి, 6 సార్లు ఓడింది. సైనాతో 13 సార్లు ఆడి 7 సార్లు గెలిచి, 6 సార్లు ఓడింది. 

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో హి బింగ్‌జియావోతో జరిగిన సెమీఫైనల్లో తొలి గేమ్‌ను 21–14తో గెలిచి, రెండో గేమ్‌లో 10–8తో ఆధిక్యంలో ఉన్న దశలో మారిన్‌ మోకాలి గాయంతో కోర్టులో కుప్పకూలింది. ఆ తర్వాత ఆమె కోలుకోకపోవడంతో హి బింగ్‌జియావోను విజేతగా ప్రకటించారు. గాయం కారణంగా మారిన్‌ కాంస్య పతక మ్యాచ్‌లో బరిలోకి దిగకపోవడంతో ఆమె ప్రత్యర్థి గ్రెగోరియా మరిస్కా (ఇండోనేసియా)కు కాంస్య పతకం లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement