స్వదేశీ పిచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన బంగ్లా అల్‌టైమ్‌ గ్రేట్‌ ఆల్‌రౌండర్‌

Careers Of Batsmen May End If They Play 10 To15 Matches On Those Pitches: Shakib Al Hasan - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ స్వదేశీ పిచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢాకాలోని పిచ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు పనికిరావని విమర్శించాడు. ఇలాంటి పిచ్‌లపై 10-15 మ్యాచ్‌లు ఆడితే యువ బ్యాట్స్‌మెన్ల కెరీర్‌లు అర్ధంతరంగా ముగుస్తాయని ఆరోపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో టీ20 సిరీస్‌లు ఆడింది. ఈ సిరీస్‌ల్లో ఆ జట్టు 4-1తేడాతో ఆస్ట్రేలియాను.. ఆ తర్వాత 3-2తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అయితే ఢాకా వేదికగా జరిగిన ఈ పది మ్యాచ్‌ల్లో కనీసం 120 పరుగులు చేయడం కష్టమైన నేపథ్యంలో షకీబ్‌ ఈమేరకు స్పందించాడు. 

ఈ సిరీస్‌ల్లో ఢాకాలోని పిచ్‌లపై బంగ్లాదేశ్ సహా పర్యాటక జట్లలోని బ్యాట్స్‌మెన్లు 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. టీ20 మ్యాచ్‌లే అయినప్పటికీ ఒక్కసారి కూడా భారీ స్కోర్లు నమోదు కాలేదు. పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలించింది. ఈ నేపథ్యంలోనే షకీబ్‌ సోంత పిచ్‌లపై విమర్శలు చేశాడు. ఇలాంటి పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ వైఫల్యాలను పరిగణలోకి తీసుకోరాదని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 రెండో దశ కోసం యూఏఈ చేరుకున్న షకీబ్‌.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ముగిసిన రెండు రోజుల్లోనే టీ20 ప్రపంచకప్‌ మొదలుకానున్న నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడటం ద్వారా పొందిన అనుభవాలను తనతో పాటు ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌.. బంగ్లాదేశ్ ఆటగాళ్లతో పంచుకుంటామని ఈ సందర్భంగా తెలిపాడు. ఇలా చేయడం టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో షకీబ్‌.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు, ముస్తాఫిజుర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (బీసీబీ) 15 మందితో కూడిన జట్టును గతవారం ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే బీసీబీ తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షకీబ్‌ ఆల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ లాంటి ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌కు బీసీబీ మొండిచేయి చూపింది. కాగా, ఈ ప్రపంచకప్‌లో బంగ్లా జట్టు తొలుత క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిటన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మెహదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్, షామీమ్‌ హోసేన్‌.

స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్.
చదవండి: ధోని సేనకు భారీ షాక్‌.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top