
ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్‌లో 2000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్‌లో నబీకి ముందు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (129 మ్యాచ్‌ల్లో 2551 పరుగులు, 149 వికెట్లు) మాత్రమే ఈ డబుల్ సాధించాడు.
యూఏఈ ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 2) పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నబీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన అతను.. తన తొలి వికెట్ అయిన ఫకర్ జమాన్‌తో అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
బ్యాటింగ్‌లో ఇదివరకే 2000 పరుగుల మార్కును దాటేసిన నబీ.. నిన్నటి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ డబుల్‌ను (2000 పరుగులు, 100 వికెట్లు) పూర్తి చేశాడు. 40 ఏళ్ల నబీ 134 అంతర్జాతీయ టీ20ల్లో 2246 పరుగులు చేసి, 101 వికెట్లు పడగొట్టాడు.
నిన్నటి మ్యాచ్‌లో నబీ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. రషీద్ ఖాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తరఫున 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రషీద్ 99 మ్యాచ్‌ల్లో 167 వికెట్లు తీసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటి పాక్‌కు ఊహించని షాకిచ్చింది. షార్జా వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాక్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదీఖుల్లా అటల్ (64), ఇబ్రహీం జద్రాన్ (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ (4-0-27-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
అనంతరం ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్ హక్ ఫారూకీ, కెప్టెన్ రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తలో 2 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో పదో నంబర్ ఆటగాడు హరీస్ రౌఫ్ చేసిన 34 పరుగులే అత్యధికం.