
ఢాకా: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టి20 క్రికెట్‌లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. వెస్టిండీస్‌లో జరుగుతోన్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో అంటిగ్వా–బార్బుడా ఫాల్కన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షకీబ్... సెయింట్ కిట్స్–నెవిస్ పేట్రియాట్స్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్‌ను రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. టి20ల్లో షకీబ్‌కిది 500 వికెట్ కావడంతో అరుదైన ఈ క్లబ్‌లో చేరిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో అతను మొత్తం 3 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 500 పైచిలుకు తీసిన బౌలర్లు ఇంతకుముందు నలుగురే ఉన్నారు. అఫ్గానిస్తాన్ వెటరన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 660 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత డ్వేన్ బ్రేవో (631; వెస్టిండీస్), సునీల్ నరైన్ (590; వెస్టిండీస్), ఇమ్రాన్ తాహిర్ (554; దక్షిణాఫ్రికా) మాత్రమే 500 క్లబ్‌లో ఉండగా ... తాజాగా ఈ జాబితాలో షకీబ్ (502) చేరాడు. అంతేకాదు ప్రస్తుతం టి20 క్రికెట్ చరిత్రలో 7000 పైచిలుకు పరుగులు, 500కు పైగా వికెట్లు తీసిన ఏకైక బౌలర్ అతనొక్కడే కావడం మరో విశేషం.