ఐపీఎల్‌ నుంచి బట్లర్‌ అవుట్‌!

Big blow for Rajasthan Royals Jos Buttler out - Sakshi

రాజస్తాన్‌ జట్టులో ఫిలిప్స్‌

ఆర్‌సీబీ టీమ్‌లో మూడు మార్పులు

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) – 2021 సీజన్‌ రెండో దశ చేరువవుతుండగా వేర్వేరు కారణాలతో జట్లలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తమ అత్యంత కీలక ఆటగాడిని కోల్పోయింది. వికెట్‌ కీపర్‌ జాస్‌ బట్లర్‌ వ్యక్తిగత కారణాలతో లీగ్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే అతని భార్య ప్రసవం ఉండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే రాజస్తాన్‌ జట్టు ఆర్చర్‌ సేవలు కోల్పోగా...స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఆడేది కూడా సందేహంగానే మారింది. బట్లర్‌ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ను రాయల్స్‌ ఎంచుకుంది. దూకుడైన ఆటకు పేరుపొందిన ఫిలిప్స్‌ కివీస్‌ జట్టు తరఫున 25 టి20ల్లో 149.70 స్ట్రైక్‌రేట్‌తో 506 పరుగులు సాధించాడు.  

తొలి సింగపూర్‌ ఆటగాడు...
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో కూడా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్‌ జంపా, ఫిన్‌ అలెన్, డానియెల్‌ స్యామ్స్‌ ఈ సారి లీగ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్‌కు చెందిన బ్యాట్స్‌మన్‌ టిమ్‌ డేవిడ్‌ కూడా ఆర్‌సీబీ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. సింగపూర్‌కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.  

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ టీమ్‌ కూడా యూఏఈ చేరుకుంది. శనివారం ఆ జట్టు తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. లెఫ్టార్మ్‌ పేసర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ టీమ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జహీర్‌ ఖాన్‌ పర్యవేక్షణలో సాధన చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top