ఆండ్రెస్కూ అవుట్‌

Bianca Andreescus first-round loss to Tamara Zidansek - Sakshi

తొలి రౌండ్‌లోనే ఓడిన ప్రపంచ ఏడో ర్యాంకర్‌

తామర జిదాన్‌సెక్‌ సంచలనం

ఫెడరర్‌ శుభారంభం

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్‌ క్రీడాకారిణి బియాంక ఆండ్రెస్కూ (కెనడా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. 3 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 85వ ర్యాంకర్‌ తామర జిదాన్‌సెక్‌ (స్లొవేనియా) 6–7 (1/7), 7–6 (7/2), 9–7తో బియాంక ఆండ్రెస్కూపై అద్భుత విజయం సాధించి తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. గత రెండేళ్లలో జిదాన్‌సెక్‌ ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. జిదాన్‌సెక్‌తో జరిగిన మ్యాచ్‌లో బియాంక తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోవడంతోపాటు ఎనిమిది డబుల్‌ ఫాల్ట్‌లు, 63 అనవసర తప్పిదాలు చేసింది.   

స్వియాటెక్‌ ముందంజ...
మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) తొలి రౌండ్‌లో 6–0, 7–5తో కాజా జువాన్‌ (స్లొవేనియా)పై... నాలుగో సీడ్‌ సోఫియా  కెనిన్‌ (అమెరికా) 6–4, 4–6, 6–3తో 2017 చాంపియన్‌ ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచారు. ఇతర మ్యాచ్‌ల్లో 16వ సీడ్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌) 1–6, 6–3, 4–6తో పొలానా హెర్కాగ్‌ (స్లొవేనియా) చేతిలో... 19వ సీడ్‌ జొహానా కొంటా (బ్రిటన్‌) 6–7 (5/7), 2–6తో సిర్‌స్టియా (రొమేనియా) చేతిలో ఓడారు.   

పురుషుల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్‌ మెద్వెదేవ్‌ (రష్యా)... స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌ శుభా రంభం చేశారు. మెద్వెదేవ్‌ 6–3, 6–3, 7–5తో  బుబ్లిక్‌ (కజకిస్తాన్‌)పై గెలిచి తొలిసారి రెండో రౌండ్‌కు చేరాడు. ఫెడరర్‌ 6–2, 6–4, 6–3తో ఇస్తోమిన్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top