భారత్‌, ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో ఎలాంటి మార్పులు లేకపోవడమే కారణం

BCCI Has Not Sought Any Change In Test Series Schedule Says ECB - Sakshi

లండన్‌: కరోనా కారణంగా అర్దంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 నిర్వహణ కోసం భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలను ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఖండించింది. అవన్నీ గాలి వార్తలేని కొట్టిపారేసింది. షెడ్యూల్‌ ప్రకారమే టెస్ట్‌ సిరీస్‌ యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. దీంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఇంగ్లండ్‌లో జరుగుతాయని ఆశించిన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. కాగా, అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ను వారం ముందుగా ముగించి, ఐపీఎల్‌ మ్యాచ్‌లు న్విహించాలని బీసీసీఐ భావించినట్లుగా ప్రచారం జరిగింది. 

ఇదిలా ఉండగా, ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆగస్టు 4న మొదలై సెప్టెంబర్‌ 14న ముగుస్తుంది. అయితే, ఈ సిరీస్‌ను సెప్టెంబర్‌ 7లోపు ముగించగలిగితే, ఈ మధ్యలో దొరికే మూడు వారాల సమయంలో మిగిలిన 31 ఐపీఎల్‌ మ్యాచ్‌లను రోజుకు రెండు చొప్పున నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుందనే ప్రచారం సాగింది. ఈ వార్తలను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ మైక్‌ అథర్టన్‌ కూడా ధృవీకరించాడు. దీంతో ఇంగ్లండ్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు కొనసాగడం ఖాయమని అభిమానులు భావించారు. కానీ తాజా పరిణామాలతో వారి ఆశలు అడియాసలుగా మిగిలిపోయేలా కనిపిస్తున్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top