Babar Azam: భారత్‌లో వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవడమే లక్ష్యం.. అంత సీన్‌ లేదు!

Babar Azam: Want To Win ICC World Cup 2023 Scheduled In India - Sakshi

India- Pakistan- ODI World Cup 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023 ట్రోఫీ గెలవడమే తన ప్రధాన లక్ష్యమని పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అన్నాడు.  కెరీర్‌లో తాను సాధించాల్సింది ఇంకెంతో ఉందని.. అయితే, అన్నిటికంటే భారత్‌లో జరుగనున్న మెగా టోర్నీలో జట్టును విజేతగా నిలపడమే ముఖ్యమని పేర్కొన్నాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా బాబర్‌ నిలిచిన సంగతి తెలిసిందే.

పెషావర్‌ కెప్టెన్‌గా..
అదే విధంగా.. సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడు స్వదేశంలో జరుగుతున్న పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. పెషావర్‌ జల్మీ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇక తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు మూడింట రెండు మ్యాచ్‌లు గెలిచిన బాబర్‌ బృందం.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ పాకిస్తాన్‌తో మాట్లాడిన బాబర్‌ ఆజం తన తదుపరి లక్ష్యాల గురించి చెప్పుకొచ్చాడు.

భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ నెగ్గాలి
‘‘నేను కెరీర్‌లో సాధించాల్సింది చాలా ఉంది. అయితే, ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం పీఎస్‌ఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేయడం.. అది కూడా ఈ ఏడాదే జరగాలి. అంతేకాకుండా ఇండియాలో జరుగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 టైటిల్‌ గెలవాలి. ప్రపంచకప్‌ ట్రోఫీ గెలిచిన జట్టుగా నా దేశానికి పేరు తీసుకురావాలి’’ అని బాబర్‌ ఆజం పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్‌-2023 నిర్వహణకు సంబంధించి బీసీసీఐ- పీసీబీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే.

అంతసీన్‌ లేదంటున్న టీమిండియా ఫ్యాన్స్‌
ఈ నేపథ్యంలో పాక్‌ నుంచి వేదికను తరలించే అంశంపై ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ చర్చలు జరుపుతోంది. కాగా తమ దేశంలో ఆసియా కప్‌ ఆడేందుకు టీమిండియా రాకపోతే.. తాము కూడా భారత్‌లో వరల్డ్‌కప్‌ ఆడమంటూ గతంలో పీసీబీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాబర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బాబర్‌ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘భారత్‌లో టీమిండియా ఫేవరెట్‌. మా వాళ్లను దాటుకుని మీరు ట్రోఫీ సాధిస్తారా? అంత సీన్‌ లేదు. ఈసారి కప్‌ భారత్‌దే. నువ్వు ఇంకో మాట చెప్పు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ICC Rankings: ఆండర్సన్‌ ప్రపంచ రికార్డు! మళ్లీ ఎవరికీ సాధ్యం కాదేమో! అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదమిదే!
Bumrah: ‘అలసిపోయాను సర్‌.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్‌ చేయనా?’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top