కార్నెట్‌ పట్టు వీడని పోరాటం

Australian Open 2022: Alize Cornet beats Halep to reach 1st quarterfinals at her 63rd Grand Slam - Sakshi

63వ ‘గ్రాండ్‌’ ప్రయత్నంలో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌కు

హలెప్‌పై గెలిచిన ఫ్రాన్స్‌ స్టార్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ  

మెల్‌బోర్న్‌: ఏళ్ల తరబడి టెన్నిస్‌ ఆడుతున్నా అందరి కళ్లలో పడని ఫ్రాన్స్‌ స్టార్‌ అలిజె కార్నెట్‌ ఇప్పుడు ఒక్క ప్రిక్వార్టర్స్‌ విజయంతో పతాక శీర్షికల్లో నిలిచింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో 32 ఏళ్ల కార్నెట్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. 15 ఏళ్ల ప్రాయంలో 2005 నుంచి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడుతున్న ఈ ఫ్రాన్స్‌ స్టార్‌ గతంలో ఎప్పుడూ ప్రిక్వార్టర్స్‌ దశనే దాటలేకపోయింది. ఇప్పుడైతే ఏకంగా రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, 14వ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)ను కంగుతినిపించి మరీ క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కార్నెట్‌ 6–4, 3–6, 6–4తో హలెప్‌పై విజయం సాధించి తన 63వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది.  

రెండో సీడ్‌ సబలెంకాకు షాక్‌
మరో ప్రిక్వార్టర్స్‌లో కూడా మరో అలుపెరగని క్రీడాకారిణి కయా కనెపి సంచలన విజయంతో క్వార్టర్స్‌ చేరింది. ఎస్తోనియాకు చెందిన 115వ ర్యాంకర్‌ కనెపి 5–7, 6–2, 7–6 (10/7)తో బెలారస్‌ స్టార్, రెండో సీడ్‌ సబలెంకాపై అద్భుత విజయం సాధించింది.  2007 నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడుతున్న కనెపి తొలిసారి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. కనెపి 15 ఏళ్ల కెరీర్‌లో మిగతా మూడు గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్లలో క్వార్టర్స్‌ చేరింది. కానీ ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం ఈ ఏడాదే ఆ అవకాశం దక్కించుకుంది. మిగతా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) 5–7, 6–3, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై, 27వ సీడ్‌ కొలిన్స్‌ (అమెరికా) 4–6, 6–4, 6–4తో 19వ సీడ్‌ ఎలైజ్‌ మెర్టెన్స్‌ (బెల్జియం)పై గెలుపొందారు.  

చెమటోడ్చిన మెద్వెదెవ్‌
పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)కు అసాధారణ ప్రతిఘటన ఎదురైంది. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన   ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్‌ 6–2, 7–6 (7/4), 6–7 (4/7), 7–5తో 70వ ర్యాంకర్‌ మ్యాక్సిమ్‌ క్రెస్సీ (అమెరికా)పై గెలిచాడు. ఇతర ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 4–6, 6–4, 4–6, 6–3, 6–4తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై, 11వ సీడ్‌ సినెర్‌ (ఇటలీ) 7–6 (7/3), 6–3, 6–4తో డి మినార్‌ (ఆస్ట్రేలియా)పై, తొమ్మిదో సీడ్‌ అలియాసిమ్‌ (కెనడా) 2–6, 7–6 (9/7), 6–2, 7–6 (7/4)తో సిలిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top