అంతరం తగ్గించినా...  ఆసీస్‌దే పైచేయి!

 Australia on top despite India avoiding follow on - Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 123/4

ప్రస్తుత ఆధిక్యం 296 పరుగులు

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 296 ఆలౌట్‌

రాణించిన రహానే, శార్దుల్‌   

మూడో రోజు ఆటలో మన బ్యాటింగ్‌ కుప్పకూలిపోలేదు. ఎదురుదాడికి దిగిన రహానే, శార్దుల్‌ భాగస్వామ్యం జట్టును కాస్త మెరుగైన స్థితికి చేర్చింది. ఆపై మన బౌలర్లు పట్టుదలగా ఆడి ఆసీస్‌ను నిలువరించగలిగారు. అయినా సరే పూర్తిగా మనదే రోజని చెప్పలేం! తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన కంగారూలు దానిని కొనసాగిస్తూ ఓవరాల్‌ ఆధిక్యాన్ని దాదాపు మూడొందలకు చేర్చారు. మిగిలిన 6 వికెట్లతో ఆ జట్టు శనివారం ఎన్ని  పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది  ఆసక్తికరం. పిచ్‌ నెమ్మదిస్తుండటంతో ప్రస్తుతానికి ఇంకా మ్యాచ్‌ ఆ్రస్టేలియాతో చేతిలోనే ఉన్నట్లు!   

లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌ కీలకదశకు చేరింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. లబుషేన్‌ (118 బంతుల్లో 41 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), గ్రీన్‌ (7 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉండగా... స్టీవ్‌ స్మిత్‌ (47 బంతుల్లో 34; 3 ఫోర్లు) రాణించాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 151/5తో తొలి ఇన్నింగ్స్‌ ఆట కొనసాగించిన భారత్‌ 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే (129 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్‌), శార్దుల్‌ ఠాకూర్‌ (109 బంతుల్లో 51; 6 ఫోర్లు) ఏడో వికెట్‌కు 109 పరుగులు జత చేసి జట్టును ఆదుకున్నారు.  

శతక భాగస్వామ్యం... 
మూడో రోజు రెండో బంతికే భరత్‌ (5)ను బోలండ్‌ బౌల్డ్‌ చేయడంతో ఆసీస్‌కు శుభారంభం లభించింది. పరిస్థితి చూస్తే భారత్‌ 200 పరుగులైనా చేయగలుగుతుందా అనిపించింది. అయితే రహానే, శార్దుల్‌ శతక భాగస్వామ్యం జట్టును గట్టెక్కించింది. ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా ధాటిగా ఆడటంతో పరుగులు వేగంగా వచ్చాయి.

కమిన్స్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6 కొట్టి రహానే 92 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి సెషన్‌లో ఆసీస్‌ పేలవ బౌలింగ్‌తో భారత బ్యాటర్ల ఆధిక్యం కొన సాగింది. 22 ఓవర్లలోనే ఏకంగా 4.95 రన్‌రేట్‌తో జట్టు 109 పరుగులు సాధించడం విశేషం. అయితే లంచ్‌ తర్వాత ఆట ఆసీస్‌వైపు మొగ్గింది.

గ్రీన్‌ అద్భుత క్యాచ్‌కు రహానే వెనుదిరగ్గా, ఉమేశ్‌ (5) అనుసరించాడు. 108 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన శార్దుల్‌ను ఎట్టకేలకు కమిన్స్‌ అవుట్‌ చేయగా, షమీ (13) వికెట్‌ తీసి స్టార్క్‌ భారత ఇన్నింగ్స్‌ ముగించాడు. లంచ్‌ తర్వాత 9.4 ఓవర్లలోనే ఆసీస్‌ మిగిలిన 4 వికెట్లు పడగొట్టగలిగింది.  

ఆకట్టుకున్న జడేజా... 
చేతిలో భారీ ఆధిక్యం ఉన్నా ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌ తడబడుతూనే సాగింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థిని నిలువరించారు. వార్నర్‌ (1), ఖ్వాజా (13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... లబుషేన్, స్మిత్‌ పరిస్థితిని చక్కదిద్దారు. లబుషేన్‌ ఎక్కువ భాగం డిఫెన్స్‌కే కట్టుబడ గా, స్మిత్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు.

అయితే ధాటి గా ఆడే క్రమంలో స్మిత్‌ ఆడిన చెత్త షాట్‌ ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. జడేజా బౌలింగ్‌లో అనూ హ్యంగా గాల్లోకి బంతి లేపి స్మిత్‌ క్యాచ్‌ ఇవ్వగా, హెడ్‌ (18) కూడా విఫలమయ్యాడు. బౌండరీ వద్ద ఉమేశ్‌ క్యాచ్‌ వదిలేసినా... తర్వాతి బంతికే జడేజాకు అతను రిటర్న్‌ క్యాచ్‌ అందించాడు. అయితే లబుషేన్, గ్రీన్‌ మరో 7.3 ఓవర్లు జాగ్రత్తగా ఆడారు.  

శార్దుల్‌ సూపర్‌... 
రెండేళ్ల క్రితం ఓవల్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధసెంచరీ చేసిన శార్దుల్‌ ఈసారీ అదే ప్రదర్శన కనబర్చాడు. ఇన్నింగ్స్‌ ఆసాంతం అనేక సార్లు బంతి అతని శరీరాన్ని బలంగా తాకినా పట్టుదలగా నిలబడి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కొంత అదృష్టం కూడా అతనికి కలిసొచ్చింది.

‘సున్నా’ వద్ద అతను ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను ఖ్వాజా వదిలేయగా, 8 పరుగుల వద్ద సునాయాస క్యాచ్‌ను గ్రీన్‌ నేలపాలు చేశాడు. 36 పరుగుల వద్ద కమిన్స్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయినా అది నోబాల్‌ కావడంతో బతికిపోయాడు. రహానే 72 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యారీ, వార్నర్‌ సమన్వయ లోపంతో క్యాచ్‌ వదిలేశారు.

ఈ ఇన్నింగ్స్‌లో రహానే టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు భారత్‌ ఇన్నింగ్స్‌ చివర్లో సిరాజ్‌ ఎల్బీ కోసం గ్రీన్‌ అప్పీల్‌ చేయగా అంపైర్‌ అవుటిచ్చాడు. సిరాజ్‌ వెంటనే రివ్యూ కోరినా... అదేమీ పట్టించుకోకుండా ఆసీస్‌ ఆటగాళ్లంతా ఆలౌట్‌ అనుకొని మైదానం వీడారు. వార్నర్, ఖాజా ప్యాడ్లు కట్టుకునేందుకు సన్నద్ధమయ్యారు. అయితే రీప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు తేలింది. దాంతో వారంతా వెనక్కి వచ్చారు.   

స్కోరు వివరాలు  
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: 469;
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) (బి) కమిన్స్‌ 15; గిల్‌ (బి) బోలండ్‌ 13; పుజారా (బి) గ్రీన్‌ 14; కోహ్లి (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 14; రహానే (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 89; జడేజా (సి) స్మిత్‌ (బి) లయన్‌ 48; భరత్‌ (బి) బోలండ్‌ 5; శార్దుల్‌ (సి) క్యారీ (బి) గ్రీన్‌ 51; ఉమేశ్‌ (బి) కమిన్స్‌ 5; షమీ (సి) క్యారీ (బి) స్టార్క్‌ 13; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్‌) 296. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–50, 4–71, 5–142, 6–152, 7–261, 8–271, 9–294, 10–296. బౌలింగ్‌: స్టార్క్‌ 13.4–0–71–2, కమిన్స్‌ 20–2–83–3, బోలండ్‌ 20–6–59–2, గ్రీన్‌ 12–1–44–2, లయన్‌ 4–0–19–1.

ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌: ఖ్వాజా (సి) భరత్‌ (బి) ఉమేశ్‌ 13; వార్నర్‌ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 1; లబుషేన్‌ (బ్యాటింగ్‌) 41; స్మిత్‌ (సి)     శార్దుల్‌ (బి) జడేజా 34; హెడ్‌ (సి అండ్‌ బి) జడేజా 18; గ్రీన్‌ (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (44 ఓవర్లలో 4 వికెట్లకు) 123.  వికెట్ల పతనం: 1–2, 2–24, 3–86, 4–111. బౌలింగ్‌: షమీ 10–4–17–0, సిరాజ్‌ 12–2–41–1, శార్దుల్‌ 6–1– 13–0, ఉమేశ్‌ 7–1–21–1, జడేజా 9–3–25–2. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top