WTC Final-2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన | Australia Announces Squad For WTC Final, Cummins, Green And Hazlewood Return, Check Names And Other Details | Sakshi
Sakshi News home page

WTC Final-2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

May 13 2025 11:03 AM | Updated on May 13 2025 12:24 PM

Australia Announces Squad For WTC Final Cummins Green Hazlewood Return

కమిన్స్‌ (PC: ICC)

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC)-2025 ఫైనల్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. లార్డ్స్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే ఈ మెగా మ్యాచ్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్‌ వివరాలను మంగళవారం వెల్లడించింది.

పునరాగమనం
కాగా గాయం కారణంగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌, స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ జట్టులోకి పునరాగమనం చేశాడు. అదే విధంగా.. వెన్నునొప్పికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.

అంతేకాదు.. మరో పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ కూడా గాయం నుంచి కోలుకుని టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక స్పిన్నర్‌ మ్యాట్‌ కుహ్నెమన్‌కు కూడా ఆసీస్‌ సెలక్టర్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే జట్టులో చోటిచ్చారు.

కరేబియన్లతో ఆడే జట్టూ ఇదే
ఇక ఇదే జట్టుతో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ పర్యటనకు కూడా వెళ్లనుంది. కరేబియన్లతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 

నాలుగు గెలిచి
ఈ ఎడిషన్‌లో ఆరు సిరీస్‌లకు గానూ నాలుగు గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇంగ్లండ్‌తో 2023లో యాషెస్‌ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న కంగారూలు 2023-24 సమ్మర్‌లో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 1-1తో సమం చేశారు.

ఇక 2024-25లో టీమిండియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 3-1తో గెలిచిన ఆసీస్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత శ్రీలంకతో నామమాత్రపు టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసి సత్తా చాటింది. ఇక ఆసీస్‌ కంటే ముందే సౌతాఫ్రికా టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

టాప్‌లో సౌతాఫ్రికా
ఇక 2023-25 ఎడిషన్‌కు గానూ సౌతాఫ్రికా పన్నెండు టెస్టులకు ఎనిమిది గెలిచి 69.44 విజయ శాతంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా.. 19 మ్యాచ్‌లకు గానూ 13 గెలిచి ఆస్ట్రేలియా 67.54తో రెండో స్థానంలో నిలిచింది. కాగా ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య జూన్‌ 11 నుంచి డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌ ఆరంభం కానుంది.

ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న తర్వాత కమిన్స్‌, హాజిల్‌వుడ్‌లతో పాటు ట్రవిస్‌ హెడ్‌, ఇంగ్లిస్‌, స్టార్క్‌ తదితరులు ఐపీఎల్‌-2025లో భాగమయ్యారు. అయితే, భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీరు స్వదేశానికి తిరిగి రాగా.. ఇష్టమైతేనే తిరిగి ఐపీఎల్‌ ఆడేందుకు వెళ్లాలని సీఏ సూచించినట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టును ప్రకటించడం గమనార్హం.

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2025కి ఆస్ట్రేలియా జట్టు
పాట్ కమిన్స్‌ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.
ట్రావెలింగ్‌ రిజర్వ్‌: బ్రెండన్‌ డాగెట్‌.
చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement