న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ఆసియా క్రీడల నిర్వహణలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఏషియన్ గేమ్స్ జరగనుండగా... ఇక తదుపరి క్రీడలను ఐదేళ్ల తర్వాత నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 2014, 2018, 2022, 2026 ఇలా సరి సంఖ్య సంవత్సరాల్లో ఈ క్రీడలు నిర్వహిస్తుండగా... 2026 ఏషియన్ గేమ్స్ ముగిసిన అనంతరం బేసి సంఖ్య సంవత్సరంలో ఈ పోటీలు జరిపే దిశగా నిర్వాహకులు చర్యలు జరుపుతున్నారు.
దీంతో ఒలింపిక్ క్రీడలకు ముందు ఇవి అర్హత పోటీలుగా ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం చైనాలో ఆసియా బీచ్ గేమ్స్ జరుగుతుండగా... ఈ సందర్భంగా ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ (ఓసీఏ) కార్యవర్గం ఈ అంశంపై చర్చించింది. ప్రస్తుతం 2020, 2024, 2028, 2032 ఇలా సరి సంఖ్య సంవత్సరాల్లో ఒలింపిక్స్ జరుగుతుండగా... ఆసియా క్రీడలను బేసి సంఖ్యకు మార్చితే విశ్వక్రీడలకు ఒక్క ఏడాది ముందు వాటిని నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ ముగిసిన అనంతరం 2030లో ఖతర్‌లోని దోహాలో ఈ క్రీడలు జరగాల్సి ఉంది.
కానీ వాటిని ఒక ఏడాది వాయిదా వేసి 2031లో నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. ‘ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఈ అంశంపై చర్చిస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసియా క్రీడల నిర్వహణ చేపడుతూనే ప్రేక్షకాదరణ, స్పాన్సర్‌షిప్ విలువ పెంచే దిశగా చర్చిస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే ఖతర్‌లోని దోహాలో జరగాల్సిన 2030 ఆసియా క్రీడలు 2031కి వాయిదా పడతాయి. ఇదే జరిగితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు ఇవి అర్హత క్రీడలుగానూ ఉపయోగపడతాయి. దీంతో అన్నీ దేశాల అథ్లెట్లు ఇందులో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా క్రీడలకు మరింత ఆదరణ పెరుగుతుంది’ అని అంతర్జాతీయ క్రీడా నిపుణుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


