ఫైనల్లో చైనాతో ఢీ.. చరిత్రకు అడుగు దూరంలో | Archery WC stage 2: India stun 10 time Olympic champions Korea Enter final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో చైనాతో ఢీ.. చరిత్రకు అడుగు దూరంలో

May 8 2026 6:20 PM | Updated on May 8 2026 7:16 PM

Archery WC stage 2: India stun 10 time Olympic champions Korea Enter final

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నమెంట్‌లో భారత మహిళల రికర్వ్‌ జట్టు పెను సంచలనం సృష్టించింది. దీపిక కుమారి, అంకిత, కుంకుమ్‌లతో కూడిన భారత జట్టు 10 సార్లు ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత దక్షిణ కొరియా జట్టును బోల్తా కొట్టించింది. 

షాంఘై వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత బృందం 5–1 సెట్‌ల (58–55, 56–56, 58–56) స్కోరుతో లీ యున్‌జీ, ఒ యెజిన్, కాంగ్‌ చెయంగ్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఈ క్రమంలో ఆదివారం జరిగే ఫైనల్లో చైనా జట్టుతో భారత్‌ తలపడుతుంది. తొలి రౌండ్‌లో భారత్‌ 6–2 సెట్‌ల (53–56, 57–54, 55–54, 55–51) స్కోరుతో ఉజ్బెకిస్తాన్‌ జట్టుపై, క్వార్టర్‌ ఫైనల్లో 5–4 సెట్‌ల (53–54, 54–49, 58–56, 55–56, 28–25) స్కోరుతో వియత్నాం జట్టుపై విజయం సాధించింది. 

1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో మహిళల ఆర్చరీ టీమ్‌ ఈవెంట్‌ను ప్రవేశ పెట్టారు. 1988 సియోల్‌ నుంచి 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు జరిగిన 10 విశ్వ క్రీడల్లో మహిళల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో దక్షిణ కొరియా జట్టే స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.

మరోవైపు.. పురుషుల రికర్వ్‌ టీమ్‌ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్‌ రాయ్, యశ్‌దీప్‌లతో కూడిన భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్‌లో 2–6 సెట్‌ల (52–55, 54–54, 53–53, 53–57) స్కోరుతో అబ్దుర్‌ రెహమాన్, రామకృష్ణ సాహా, మిషాద్‌లతో కూడిన బంగ్లాదేశ్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్‌ రాయ్‌ మూడో రౌండ్‌ చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement