ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు వేళాయె! | Archery Premier League to be held in New Delhi next month | Sakshi
Sakshi News home page

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు వేళాయె!

Sep 19 2025 4:28 AM | Updated on Sep 19 2025 4:28 AM

Archery Premier League to be held in New Delhi next month

వచ్చే నెలలో న్యూఢిల్లీ వేదికగా నిర్వహణ 

6 జట్లు... 48 మంది ఆర్చర్లు.. 12 మంది విదేశీయులు

బరిలో జ్యోతి సురేఖ, చికిత, హంసిని, ధీరజ్, జిజ్ఞాస్‌ 

మొత్తం ప్రైజ్‌మనీ రూ. 2 కోట్లు 

బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌చరణ్‌  

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)... 
ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)... 
ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)... 
హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)... 
అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ (యూటీటీ)... 
రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌ (ఆర్‌పీఎల్‌)... 
టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌)... 
ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌)... 
ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)... 
ఇలా అన్ని ఆటల్లో లీగ్‌ల హవా సాగుతున్న వేళ...కొత్తగా ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)కు కూడా వచ్చే నెలలో తెరలేవనుంది. 

న్యూఢిల్లీ: ప్రతిభకు పట్టం కడుతూ... ఆటకు  మరింత విస్తృత ప్రచారం కల్పిస్తూ... ప్రపంచ ఆర్చరీలో భారత్‌ను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యంగా ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు అంకురార్పణ జరిగింది. అక్టోబర్‌ 2 నుంచి 12 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగునున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ వివరాలను గురువారం నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం ఆరు జట్లు పాల్గొననున్న ఈ లీగ్‌లో 48 మంది ఆర్చర్లు బరిలోకి దిగనున్నారు. 

వారిలో 12 మంది విదేశీయులు కాగా... మిగిలిన 36 మంది స్వదేశీ ఆర్చర్లు. ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్చర్లు ఆండ్రియా బెకెర్రా (కాంపౌండ్‌), బ్రాడీ ఎలీసన్‌ (రికర్వ్‌) ఈ లీగ్‌లో భాగం కానున్నారు. భారత్‌ నుంచి స్టార్‌ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, దీపిక కుమారి, అతాను దాస్, బొమ్మదేవర ధీరజ్‌ ఇలా పలువురు ఆర్చర్లు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన చిట్టిబొమ్మ జిజ్ఞాస్, మాదాల సూర్య హంసిని, తెలంగాణ అమ్మాయి తనపర్తి చికిత కూడా ఈ లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.  

ఈ లీగ్‌తో భారత ఆర్చరీ ముఖచిత్రం మారిపోతుందని భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) భావిస్తోంది. ‘ఆర్చరీలో మనకు ఘన చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి మన దేశంలో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వరల్డ్‌కప్, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్, ఆసియా చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్స్‌ ఇలా ప్రతి పోటీలోనూ భారత ఆర్చర్లు పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో మాత్రం పతకం ఇంకా బాకీ ఉంది. ఈ లీగ్‌ ద్వారా ఆ ముచ్చట కూడా తీరడం ఖాయమే’ అని ఏఏఐ కార్యదర్శి వీరేంద్ర సచ్‌దేవ్‌ అన్నారు.   

» ఒక్కో జట్టులో నలుగురు మహిళలు, నలుగురు పురుష ఆర్చర్ల చొప్పున 8 మంది ఉంటారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, ఆరుగురు భారత ఆర్చర్లు ఉంటారు. విదేశీయుల్లో ఒకరు పురుష ఆర్చర్, మరొకరు మహిళా ఆర్చర్‌ ఉంటారు. 
»    భారత ఆర్చరీ అసోసియేషన్‌ ఇటీవల నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌తో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఆర్చర్లను ఎంపిక చేశారు. 
»   కాంపౌండ్, రికర్వ్‌ విభాగాల్లో ఒలింపిక్‌ ప్రమాణాలకు తగ్గట్లు 70 మీటర్లు, 50 మీటర్లలో పోటీలు జరుగుతాయి. ఈ లీగ్‌ మొత్తం ప్రైజ్‌మనీ 2 కోట్ల రూపాయలు. 
» రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో రోజుకు మూడు మ్యాచ్‌లు (20 నిమిషాలు) నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో బాణం సంధించేందుకు 20 సెకన్ల సమయం ఇస్తుండగా... ఈ లీగ్‌లో 15 సెకన్లకు తగ్గించారు. 
»   రికర్వ్‌ విభాగంలో మూడో ర్యాంకర్‌ దీపిక కుమారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్‌తో పాటు వెటరన్స్‌ అతాను దాస్, తరుణ్‌దీప్‌ ఉన్నారు. 
»  కాంపౌండ్‌ విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్‌ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ రిషభ్‌ యాదవ్, అభిషేక్‌ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్, పర్ణీత్‌ కౌర్‌ బరిలో ఉన్నారు.    

ఏ జట్టులో ఎవరున్నారంటే...
పృథ్వీరాజ్‌ యోధాస్‌ (ఢిల్లీ): మాటియస్‌ గ్రాండె, ఆండ్రియా బికెర్రా, అభిషేక్‌ వర్మ, గాథ, ప్రియాంశ్, శర్వరి, క్రిష్‌ కుమార్, ప్రాంజల్‌. 

చెరో ఆర్చర్స్‌ (జార్ఖండ్‌): మాథియస్‌ ఫుల్లెర్టన్, క్యాథరినా బ్యూర్, రాహుల్, ప్రీతిక ప్రదీప్, అతాను దాస్, మాదాల సూర్య హంసిని, సాహిల్‌ రాజేశ్, కుంకుమ్‌ మొహొద్‌. 

కాకతీయ నైట్స్‌ (తెలంగాణ): నికో వైనెర్, ఎలియా క్యానల్స్, నీరజ్, వెన్నం జ్యోతి సురేఖ, రోహిత్, అవ్‌నీత్, చిట్టిబొమ్మ జిజ్ఞాస్, తిషా పునియా. 

చోళా చీఫ్స్‌ (తమిళనాడు): బ్రాడీ ఎలీసన్, మీరి మారిటా, రిషభ్‌ యాదవ్, దీపిక కుమారి, తరుణ్‌దీప్‌ రాయ్, తనిపర్తి చికిత, పులకిత్, అన్షిక కుమారి. 

మైటీ మరాఠాస్‌ (మహారాష్ట్ర): మైక్‌ స్కాలెస్సర్, అలెగ్జాండ్రా వాలెన్సియా, బొమ్మదేవర ధీరజ్, పరీ్ణత్‌ కౌర్, అమన్‌ సైనీ, భజన్‌ కౌర్, మృణాల్‌ చౌహాన్, మధుర. 

రాజ్‌పుతానా రాయల్స్‌ (రాజస్తాన్‌): మెటా గాజోజ్, ఎల్లా గిబ్సన్, ప్రథమేశ్, అంకిత, ఓజస్‌ ప్రవీణ్, బసంతి, సచిన్‌ గుప్తా, స్వాతి.  

ఏపీఎల్‌ డైరెక్టర్‌గా అనిల్‌ కామినేని 
ఈ లీగ్‌కు రూపకల్పన చేసిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ కామినేని... ఏపీఎల్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొంటున్న ఈ లీగ్‌తో భారత ఆర్చర్లకు ఎంతో లాభం జరుగుతుందని అనిల్‌ వెల్లడించారు. ‘ప్రపంచ ఆర్చరీ సంఘంతో ఈ లీగ్‌ గురించి చర్చించాం. ఇకపై ప్రతీఏటా దీన్ని నిర్వహిస్తామని అందుకు తగ్గట్లు అంతర్జాతీయ షెడ్యూల్‌ రూపొందించాలని చెప్పాం. 

ప్రస్తుతం ఆర్చరీలో దక్షిణ కొరియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆరంభ లీగ్‌లో పలువురు కొరియా స్టార్లు పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. అయితే ఈ లీగ్‌ సమయంలో వారి దేశంలో సెలెక్షన్‌ ట్రయల్స్‌ ఉన్నాయి. ఫలితంగా ఈసారి నుంచి కాకుండా వచ్చే ఏడాది కొరియా ప్లేయర్లను కూడా చూడవచ్చు’ అని అనిల్‌ తెలిపారు. సినీనటుడు రామ్‌చరణ్‌ ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ప్రతిభను గుర్తించి మరింత సానబెట్టేందుకు ఈ లీగ్‌ ఎంతగానో ఉపకరించనుంది. 

ప్రపంచ ఆర్చరీలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా ఈ లీగ్‌ రూపకల్పన చేసినట్లు డైరెక్టర్‌ అనిల్‌ కామినేని వెల్లడించారు. ఆర్చరీలో కొత్త విప్లవం తీసుకొచ్చి తద్వారా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నిలపడమే తమ ధ్యేయమని తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్చరీని మరింత మందికి చేరువ చేసేందుకు రామ్‌చరణ్‌ను అంబాసిడర్‌గా ఎంపికచేసినట్లు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement