APL 2022: ఏపీఎల్‌లో రాణిస్తున్న వైజాగ్‌ ఆటగాళ్లు

APL 2022: Visakhapatnam Young Cricketers Shine in Andhra Premier League - Sakshi

లీగ్‌లో ముగిసిన తొలి దశ

వర్షంతో మూడో రోజు మ్యాచ్‌లు రద్దు 

విశాఖ స్పోర్ట్స్‌: ఐపీఎల్‌.. క్రికెట్‌ ఆడే ప్రపంచ దేశాల్లోని ఆట గాళ్లకు ఎంతో మోజు. దేశంలో ఈ లీగ్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో ప్రీమి యర్‌ లీగ్‌లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌ స్ఫూర్తితో ఆంధ్రాలో ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌) ప్రారంభమైంది. లీగ్‌ తొలి దశ శుక్రవారంతో ముగిసింది. లీగ్‌ల్లో నాలుగు ప్రాంచైజీ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. రాయలసీమ కింగ్స్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా వైజాగ్‌ వారియర్స్‌ ఒక మ్యాచ్‌నే ఆడింది. దీంతో బెజవాడ టైగర్స్‌తో పాటు మిగిలిన మూడు జట్లు ఆరేసి పాయింట్లు సాధించినా.. నెట్‌ రన్‌రేట్‌తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర లయన్స్‌ రెండో స్థానంలో, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్‌ మూడో స్థానంలో, గోదావరి టైటాన్స్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.  


రాణిస్తున్న మన కుర్రాళ్లు
 
ఉత్తరాంధ్ర నుంచి రెండు ప్రాంచైజీలకు అవకాశం ఇవ్వగా సెంట్రల్‌ ఆంధ్ర, దక్షిణాంధ్ర నుంచి మరో రెండేసి ప్రాంచైజీలకు అర్హత కల్పించారు. ఉత్తరాంధ్ర నుంచి హోం టీమ్‌గా వైజాగ్‌ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్‌ జట్లు ఆడుతున్నాయి. వైజాగ్‌ వారియర్స్‌కు విశాఖ ఆటగాళ్లు లేకున్నా.. ఉత్తరాంధ్ర లయన్స్‌ జట్టు కెప్టెన్‌గా భరత్‌ను, బౌలర్‌ అజయ్‌ను తీసుకుంది. అయితే అజయ్‌కు తొలి మ్యాచ్‌లో బాటింగ్‌ చేసే అవకాశం రాకుండానే జట్టు విజయం సాధించగా.. భరత్‌ అందుబాటులో లేడు. రెండో మ్యాచ్‌కు భరత్‌ అందుబాటులోకి వచ్చినా.. వర్షం అడ్డంకిగా మారి మ్యాచ్‌ రద్దయింది. సెంట్రల్‌ ఆంధ్ర నుంచి పోటీపడుతున్న రెండు జట్లకు విశాఖ కుర్రాళ్లే కెప్టెన్లుగా ముందుండి.. ఆడిన తొలి మ్యాచ్‌ల్లో జట్లను విజయతీరానికి చేర్చారు. 


బెజవాడ టైగర్స్‌కు అంతర్జాతీయ ఆటగాడు రికీబుయ్‌ ముందుండి నడపడమే కాక తొలి మ్యాచ్‌లో మూడో వికెట్‌ పడకుండానే విశాఖ కుర్రాడు అవినాష్‌తో కలిసి అజేయంగా ఉండి జట్టును గెలిపించాడు. బౌలర్‌ మనీష్‌ రెండు వికెట్లతో పాటు చివరి బ్యాటర్‌ను రనౌట్‌ చేసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్‌కే నిలువరించడంలో సహకరించాడు. ఇక బి.సుమంత్‌(21 బంతుల్లోనే రెండు ఫోర్లతో 31 పరుగులు) ఓపెనర్‌గా వచ్చి తొలి వికెట్‌కు 66 పరుగుల(లక్ష్య ఛేదనలో సగం పరుగులు) భాగస్వామ్యాన్ని అందించాడు. టాప్‌ ఆర్డర్‌లో అవినాష్, రికీబుయ్‌ జోడీ వికెట్‌ చేజారుకుండానే జట్టును గెలిపించింది. 


ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్‌ను విశాఖ కుర్రాడు శశికాంత్‌ కెప్టెన్సీలో విజయతీరానికి చేర్చి శుభారంభం చేశాడు. టోర్నీలోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేయడమే కాక మ్యాచ్‌ బెస్ట్‌గానూ నిలిచాడు. విశాఖ కుర్రాళ్లు ఓపెనర్‌గా హేమంత్, టాప్‌ ఆర్డర్‌లో నితీష్‌(25) రాణించారు. ఇక దక్షిణాంధ్ర జట్లు కోస్టల్‌ రైడర్స్, రాయలసీమ కింగ్స్‌లో ఒక్క విశాఖ ఆటగాడికి ఆడే అవకాశం రాలేదు. అటు ఐపీఎల్‌లోనే కాకుండా ఏపీఎల్‌లో సైతం స్థానిక ఆటగాళ్లు ఇతర ప్రాంచైజీ జట్లకు ఆడుతూ విజయంలో కీలకపాత్ర పోషించడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం.  


వరుణుడి రాకతో మ్యాచ్‌లు రద్దు 

ఏపీఎల్‌లో భాగంగా వైఎస్సార్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో బెజవాడ టైగర్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఏడు ఓవర్లలో మూడు వికెట్లకు 23 పరుగుల చేసిన స్థితిలో వరుణుడు ప్రవేశించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మ్యాచ్‌ రద్దయింది. ఇరు జట్లకు రెండేసి పాయింట్లు చేకూరాయి. రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సిన మ్యాచ్‌ సైతం వర్షం కారణంగా రద్దయింది. దీంతో గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్‌ జట్లకు చెరో రెండేసి పాయింట్లు కేటాయించారు. (క్లిక్: విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top