2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌పై అమెరికా స్టార్ అథ్లెట్ గురి
40 ఏళ్ల వయసులో ట్రాక్‌పై పునరాగమనం
ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన మహిళగా రికార్డు
తల్లి అయ్యాక తిరిగి పోటీ పడనున్న ఏడుసార్లు ఒలింపిక్ చాంపియన్
లాస్ ఏంజెలిస్: ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన అలీసన్ ఫెలిక్స్ విశ్వక్రీడల్లో పునరాగమనం చేయనుంది. నాలుగేళ్ల క్రితమే ట్రాక్‌కు టాటా చెప్పి తల్లి అయిన ఫెలిక్స్... మరో రెండేళ్లలో అమెరికా వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనాలని భావిస్తోంది. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ నుంచి మొదలుకొని 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు తన హవా కొనసాగించిన ఈ అమెరికా స్టార్... 2022లో కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అయితే 40 ఏళ్ల వయసులో మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించిన తర్వాత తిరిగి ట్రాక్‌పై పరుగు తీయాలని నిర్ణయించుకుంది.
ఇప్పటి వరకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 11 పతకాలు (7 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించిన ఫెలిక్స్... ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా రన్నర్‌గా రికార్డు సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి గెలిచిన ఫెలిక్స్... మిగిలిన ఆరు స్వర్ణాలను రిలేలో సాధించింది. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం సాధించడంతో ప్రారంభమైన ఆమె జోరు... 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు సాగింది. ట్రాక్‌పై అడుగు పెడితే తిరుగు లేకుండా దూసుకెళ్లే ఫెలిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) చేజిక్కించుకుంది.

ఇప్పటి వరకు ఐదు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ అమెరికా అథ్లెట్... 2028లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలో సభ్యురాలిగానూ కొనసాగుతోంది. సొంతగడ్డపై విశ్వక్రీడలు జరుగుతుండటంతో చివరి ప్రయత్నం చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. ‘సాహసోపేతమైన పనులు చేయొద్దని మనం చాలా మందికి చెబుతుంటాం.
ఈ వయసులో నేను ఇంట్లోనే ఉండి పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలి. కానీ అలాగే ఎందుకు చేయాలి. దీన్ని ఎందుకు మార్చకూడదు. లక్ష్యాన్ని చేరేందుకు మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు. ఫలితం ఎలా వచ్చినా నేను నా పిల్లలతోనే ఉంటాను. వాళ్లతో కలిసి సరదాగా గడుపుతూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాను. కానీ స్వదేశంలో జరిగిన ప్రధాన పోటీల్లో పాల్గొనలేకపోయాను అనే భావన మాత్రం ఉండదు కదా’ అని ఫెలిక్స్ వివరించింది.


