రషీద్‌ ఖాన్‌ స్థానంలో ఆడమ్‌ జంపా | Adam Zampa Joins Oval Invincibles As Rashid Khan Replacement For The Hundred Final | Sakshi
Sakshi News home page

రషీద్‌ ఖాన్‌ స్థానంలో ఆడమ్‌ జంపా

Aug 28 2025 6:36 PM | Updated on Aug 28 2025 6:53 PM

Adam Zampa Joins Oval Invincibles As Rashid Khan Replacement For The Hundred Final

పురుషుల హండ్రెడ్‌ లీగ్‌లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ వరుసగా మూడో ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరింది. గత రెండు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరడమే కాకుండా టైటిల్‌ను కూడా ఎగరేసుకుపోయిన ఇన్విన్సిబుల్స్‌ వరుసగా మూడో టైటిల్‌పై గురి పెట్టింది. అయితే ఫైనల్‌కు ముందు ఆ జట్టుకు ఓ క్లిష్టమైన సమస్య వచ్చింది. అంతలోనే దానికి తగ్గ పరిష్కారం ​కూడా దొరికింది.

ఈ సీజన్‌లో ఇన్విన్సిబుల్స్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర (6 మ్యాచ్‌లోల​ 12 వికెట్లు) పోషించిన ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. ఫైనల్స్‌కు ముందు జాతీయ విధుల కారణంగా జట్టును వీడాడు. అయితే రషీద్‌ ఖాన్‌ బదులుగా మరో స్టార్‌ స్పిన్నర్‌ రీఎంట్రీ ఇచ్చాడు. గత రెండు సీజన్లలో ఇన్విన్సిబుల్స్‌ టైటిల్స్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా.. ఈ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జట్టులో చేరాడు.

దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా వైట్‌బాల్‌ సిరీస్‌ కారణంగా జంపా ఈ సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. దక్షిణాఫ్రికా సిరీస్‌ ముగియడంతో అతడు తిరిగి జట్టులో చేరాడు. ఇదే సమయానికి రషీద్‌ ఖాన్‌ జట్టును వీడాల్సి రావడంతో జంపా అతని స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.

జంపాకు హండ్రెడ్‌ లీగ్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ లీగ్‌లో అతను 16 మ్యాచ్‌ల్లో 12.86 సగటున, 7.21 ఎకానమీతో 29 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా టీ20ల్లో జంపాకు అదిరిపోయే ట్రాక్‌ రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్‌లో అతడు 21.53 సగటున 385 వికెట్లు తీశాడు. ఈ గణాంకాలు చూస్తే హండ్రెడ్‌ లీగ్‌ ఫైనల్లో జంపా ఏమేరకు ప్రభావితం చేయగలడో చెప్పవచ్చు.

కాగా, ఈ సీజన్‌ హండ్రెడ్‌ లీగ్‌లో ఇన్విన్సిబుల్స్‌ అదిరిపోయే ప్రదర్శనలతో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. లీగ్‌ దశలో ఆ జట్టు 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ట్రెంట్‌ రాకెట్స్‌కు కూడా ఇనే విజయాలు సాధించినా, ఇన్విన్సిబుల్స్‌తో పోలిస్తే ఆ జట్టు రన్‌రేట్‌ కాస్త తక్కువగా ఉంది. 

పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఇన్విన్సిబుల్స్‌, ట్రెంట్‌ రాకెట్స్‌, నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఆగస్ట్‌ 30న జరిగే ఎలిమినేటర్‌లో ట్రెంట్‌ రాకెట్స్‌, సూపర్‌ ఛార్జర్స్‌  అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆగస్ట్‌ 31న జరిగే ఫైనల్లో ఇన్విన్సిబుల్స్‌తో తలపడుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement