Harbhajan Singh: ఆప్‌ కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎంపీగా హర్భజన్‌..?

AAP To Send Harbhajan Singh To Rajya Sabha Says Reports - Sakshi

Harbhajan Singh As AAP Rajya Sabha MP: పంజాబ్‌లో నూతనంగా కొలువుదీరిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఢిల్లీలోని ఆప్‌ వర్గాల సమాచారం. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఆప్‌కు కొత్తగా రెండు రాజ్యసభ బెర్తులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భజ్జీని పెద్దల సభకు పంపాలని పార్టీ కేంద్ర కార్యవర్గం కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

పంజాబ్‌లో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించే నిమిత్తం భజ్జీకి మరో కీలక బాధ్యత కూడా అప్పజెప్పాలని ఆప్‌ యోచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే జలంధర్ స్పోర్ట్ యూనివర్శిటీ బాధ్యతలను కూడా భజ్జీకే అప్పగించాలని భావిస్తుంది. ఆప్‌ తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రధాన అస్త్రంగా వాడుకుంది. దీంతో ఎన్నికల్లో యువత భారీ సంఖ్యలో చీపురు గుర్తుకు ఓట్లేశారు.

కాగా, పంజాబ్‌ కొత్త సీఎం భగవంత్ సింగ్‌ మాన్‌తో హర్భజన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ బంపర్‌ మెజార్టీ సాధించాక మాన్‌కు హర్భజన శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇటీవల వెలువడిన పంజాబ్‌ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 117 సీట్లకు గాను ఆప్‌ 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, ఢిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో గద్దెనెక్కింది. 
చదవండి: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం.. పాపం న్యూజిలాండ్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top