5 బంతుల్లో 5 వికెట్లు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్‌ బౌలర్‌ | 5 Wickets, 5 Balls, Curtis Campher Becomes First Player To Achieve Never Done Before Feat In Historic Display | Sakshi
Sakshi News home page

5 బంతుల్లో 5 వికెట్లు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్‌ బౌలర్‌

Jul 11 2025 7:23 AM | Updated on Jul 11 2025 10:16 AM

5 Wickets, 5 Balls, Curtis Campher Becomes First Player To Achieve Never Done Before Feat In Historic Display

పొట్టి క్రికెట్‌లో ఊహలకందని ఫీట్‌ నమోదైంది. ఓ బౌలర్‌ వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఐర్లాండ్‌ ఇంటర్‌ ఫ్రావిన్సియల్‌ టీ20 టోర్నీలో ఇది జరిగింది. ఈ టోర్నీలో మన్‌స్టర్‌ రెడ్స్‌కు ఆడుతున్న (కెప్టెన్‌ కూడా) ఐర్లాండ్‌ జాతీయ జట్టు ప్లేయర్‌ కర్టిస్‌ క్యాంఫర్‌.. నార్త్‌ వెస్ట్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్టిస్‌ జట్టు రెడ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కర్టిస్‌ బ్యాట్‌తో కూడా రాణించి (24 బంతుల్లో 44) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్‌ 11 ఓవర్లలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండింది. ఈ దశలో తన రెండో ఓవర్‌ వేసేందుకు బంతినందుకున్న కర్టిస్‌.. చివరి రెండు బంతులకు రెండు వికెట్లు (జరెడ్‌ విల్సన్‌, గ్రహం హ్యూమ్‌) తీశాడు.

అనంతరం కర్టిస్‌ తన మూడో ఓవర్‌లోనూ (ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌) మ్యాజిక్‌ కొనసాగించాడు. తొలి బంతికే ఆండీ మెక్‌బ్రైన్‌ను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ పూర్తి చేసిన కర్టిస్‌.. ఆతర్వాతి రెండు బంతులకు కూడా రాబీ మైలర్‌, జోష్‌ విల్సన్‌లను ఔ​ట్‌ చేసి ప్రొఫెషనల్‌ టీ20 క్రికెట్‌లో మునుపెన్నడూ సాధ్యపడని ఫీట్‌ను నమోదు చేశాడు. 

ఈ మ్యాచ్‌లో 2.2 ఓవర్లు వేసిన కర్టిస్‌ 16 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఫలితంగా వారియర్స్‌ 88 పరుగులకే ఆలౌటైంది. కర్టిస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో రెడ్స్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కర్టిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది.

చరిత్ర సృష్టించిన కర్టిస్‌
ఈ ప్రదర్శనతో కర్టిస్‌ తన పేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నాడు. పురుషుల ప్రొఫెషనల్‌ టీ20 క్రికెట్‌లో (అంతర్జాతీయ క్రికెట్‌, దేశవాలీ క్రికెట్‌, ఫ్రాంచైజీ క్రికెట్‌) మునుపెన్నడూ ఏ బౌలర్‌ వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీయలేదు. 

అయితే ఓ స్థానిక  మ్యాచ్‌లో మాత్రం ఇటీవలే ఈ ప్రదర్శన నమోదైంది. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆడే దిగ్వేశ్‌ రాఠీ ఓ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 5 వికెట్లు తీశాడు. ఇందులో తొలి నాలుగు వికెట్లు క్లీన్‌ బౌల్డ్‌ కావడం విశేషం.

4 బంతుల్లో 4 వికెట్ల రికార్డు కూడా..!
కర్టిస్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఓ సందర్భంలో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్టిస్‌ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆరుగురు బౌలర్లలో కర్టిస్‌ ఒకరు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement