
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2026 టి20 ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లు భారత్‌లోని 5 మైదానాలతో పాటు శ్రీలంకలోని రెండు గ్రౌండ్‌లలో జరగనున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత జట్టు పాకిస్తాన్‌లో.... పాకిస్తాన్ జట్టు భారత్‌లో మ్యాచ్‌లు ఆడని నేపథ్యంలో... ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లను ఐసీసీ తటస్థ వేదికపై నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు టి20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే... మెగా టోర్నీ తుది సమరం కొలంబోలో జరుగుతుంది. ఐసీసీ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆడాల్సిన అన్నీ మ్యాచ్‌లను శ్రీలంకలోనే నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా విడుదల చేయకపోయినప్పటికీ... వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి.
2024 టి20 వరల్డ్‌కప్ మాదిరిగానే మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించనున్నారు. అందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు ‘సూపర్–8’ దశకు... అందులో మెరుగ్గా ఆడిన జట్లు సెమీఫైనల్‌కు చేరునున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ భారత్‌తో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ జట్లు ఇప్పటికే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించాయి.
ఇందులో ఇటలీ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇక మిగిలిన ఐదు స్థానాల కోసం క్వాలిఫయింగ్ టోర్నీలు జరగనున్నాయి. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి 2 జట్లు, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో మూడు జట్లు ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించనున్నాయి. 2024లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో జరిగిన టి20 ప్రపంచకప్‌ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.