రైతు డిస్కం పేరిట ఉరితాడు | - | Sakshi
Sakshi News home page

రైతు డిస్కం పేరిట ఉరితాడు

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

నంగునూరు(సిద్దిపేట): కాంగ్రెస్‌ ప్రభుత్వం తెస్తున్న రైతు డిస్కం ఉచిత విద్యుత్‌కు ఉరితాడులా మారుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. పొద్దున సూర్యుడు వచ్చిన తర్వాత మోటార్లు ఆన్‌ అయి, సాయంత్రం 5 గంటలకు ఎండపోగానే బంద్‌ అవతాయని ఆరోపించారు. శనివారం పాలమాకులలో పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ముండ్రాయిలో రైతులతో ముచ్చటించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో చిన్న సమస్య వచ్చినా మెసేజ్‌ పెట్టగానే పరిష్కారమయ్యేదని, నేడు పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల ధరలు నేలచూపు చూస్తుండటంతో పిల్లల ఫీజులు కట్టలేక అల్లాడుతున్నారన్నారు. రైతు డిస్కంకు సోలార్‌ పవర్‌ మాత్రమే కేటాయించడంతో రోజుకు 7, 8 గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం రైతుబంధుకు ఎగనామం పెట్టి కేవలం రెండెకరాలకే అందజేసిందని ఎద్దేవా చేశారు.

ఆరోగ్య సమాజంలో భాగస్వామ్యం కావాలి

సిద్దిపేటజోన్‌: యోగా శిక్షకులుగా ఆరోగ్య సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక టీటీసీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా శిక్షకుల, న్యాయ నిర్ణేతల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆధునిక జీవన శైలిలో ఏకాగ్రత లోపించి చిన్న వయసులోనే పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడింటిని ఏకీకృతం చేసి మన పనిపై ఏకాగ్రత పెంచే అద్భుతమైన సాధనం యోగా అని పేర్కొన్నారు. యోగాను ఒక పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. కార్పొరేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు ర్యాంకుల కోసం ఏసీ గదుల్లో బంధించి బట్టీ పట్టించే విధానం సరికాదన్నారు. జీవితంలో ఏదైనా అపజయం వస్తే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండొద్దని, వాటిని తట్టుకొని దృఢంగా ఉండేలా చిన్నప్పటి నుంచే యోగా ద్వారా నేర్పించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్స్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వేణుగోపాల్‌ రెడ్డి, సాయిరాం, పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంపత్‌ రెడ్డి, రాష్ట్ర యోగాసన అసోసియేషన్‌ ప్రతినిధులు శ్రీధర్‌ రావు, రాంరెడ్డి, అంజయ్య, అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement