కలెక్టర్ హైమావతి
కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశం
రుణలక్ష్యం చేరాల్సిందే
సిద్దిపేటరూరల్: ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని నెలాఖరులోగా సాధించాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,736 కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్ణయించగా 2025 డిసెంబర్ నాటికి రూ. 7,309 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆయా బ్యాంకుల రుణ నిల్వలు, మార్కెట్ షేర్ ఆధారంగా బ్యాంకులవారీగా ఏప్రిల్ నెలలో ప్రయారిటీ, నాన్ ప్రయారిటీ రుణాల లక్ష్యాలను నిర్దేశిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల, పరిశ్రమల శాఖ, వ్యవసాయ రుణాలను నిర్దేశిత లక్ష్యం మేరకు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఎల్డీఎం హరిబాబు, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయ్ భార్గవ్, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు
దుబ్బాకటౌన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందిని హెచ్చరించారు. రాయపోల్‌లోని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. వైద్యాధికారి అరెపల్లిలో ఫీల్డ్ విజిట్ లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా వీడియో కాల్ చేసి నిజనిర్ధారణ చేశారు. ఏదో ఒక సాకు చెబుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనతంరం దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారంలోని గురుకులకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటలు నాసిరకంగా ఉండటంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


