● కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం ● అసెంబ్లీలో మాజీమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ఐటీ రంగాన్ని క్షేత్ర స్థాయిలో విస్తరించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐటీ టవర్లను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకు సిద్దిపేట ఐటీ టవరే ఉదాహరణ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో సిద్దిపేట ఐటీ టవర్ సమస్యలపై ప్రస్తావించారు. ఇటీవల సిద్దిపేట ఐటీ టవర్ సందర్శించగా అనేక ఇబ్బందులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 18 కంపెనీలు పనిచేస్తే ప్రస్తుతం 7కంపెనీలు వెళ్లిపోయి 11 మాత్రమే ఉన్నాయన్నారు. నెట్‌బిల్లు లేక ఐటీ టవర్‌కు ఇంటర్ నెట్ కనెక్షన్ కట్ చేశారని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో 4నెలలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న కంపెనీలకు మూడు నెలల ఫ్రీ రెంటల్ సౌకర్యం కల్పించాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు విడుదల చేయాలని, కొత్త కంపెనీలను ఆహ్వానించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
కుంటల, చెరువుల మరమ్మతులకు నిధులు
నియోజకవర్గ పరిధిలోని చెరువుల, కుంటల మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి రూ.కోటి7లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇంద్రగూడెం పల్లె కుంట, మొండి కుంట మరమ్మతులకు రూ.48లక్షల20వేలు, మిట్టపల్లి నుంచి గుండ్ల చెరువు ఫిడర్ ఛానల్ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో నూతన బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు పంపించగా రూ.47లక్షల20వేలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మెరుపు కుంట శాశ్వత మరమ్మతుల కోసం రూ.12లక్షల 45వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు.


