పట్టణ తీర్పు ఎటువైపో..!
అంచనాల్లో నేతలు
అభ్యర్థుల భవితవ్యం బాక్స్‌ల్లో నిక్షిప్తం కావడంతో అభ్యర్థులు, నేతల్లో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. గెలుపుపై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లు ప్రచారం చేశాయి. పార్టీల వ్యూహాలు, హామీలు, ప్రచార సరళిని గమనించిన ఓటర్లు ఓటు రూపంలో బ్యాలెట్ బాక్స్‌ల్లో నిక్షిప్తం చేశారు. – సాక్షి, సిద్దిపేట
ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు, నేతలు పడరాని పాట్లు పడ్డారు. పలు చోట్ల జోరుగా డబ్బులు పంపిణీ చేయగా.. మరికొన్ని చోట్ల మద్యం ఏరులై పారింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే కంటే ముందే ఆయా పార్టీల అభ్యర్థులను వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారికి డబ్బులు, మద్యం అందించారు. చివరి అవకాశం కావడంతో ధన ప్రవాహం భారీగా సాగింది. అభ్యర్థులు డబ్బులకు వెనుకాడకుండా పంపిణీ చేయడం గమనార్హం.
జోరుగా బెట్టింగ్‌లు
పోలింగ్ పూర్తి కావడంతో ఏ వార్డులో ఎవరు గెలుస్తారని జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. శుక్రవారం ఓట్లను లెక్కించనున్న నేపథ్యంలో ఏ పార్టీకి కౌన్సిలర్ల గెలుపు మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది? ఏ పార్టీ ఓడుతుంది? ఏ పార్టీ మున్సిపల్‌ను కై వసం చేసుకుంటుంది? అని గల్లీల్లో జోరుగా పందెం రాయుళ్లు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ముఖ్యంగా చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఆశావహులు ఉన్న చోట్ల ఎక్కువ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పలు చోట్ల ద్విముఖ పోరు, మరికొన్ని చోట్ల త్రిముఖ పోరు కొనసాగింది. కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉండటంతో పోరు మరింత ఆసక్తినిరేపుతోంది.
ప్రశాంతంగా పోలింగ్: కలెక్టర్
గజ్వేల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మహతి విద్యానికేతన్ ౖహైస్కూల్, బీఎంఆర్ డిగ్రీ కళాశాల, మైనార్టీ వెల్ఫేర్ కంప్యూటర్ సెంటర్, సెట్విన్ శిక్షణ సంస్థ, ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆయా మున్సిపాలిటీల పరిధిలోని 72వార్డుల్లో 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లోనూ పోలింగ్ సజావుగా సాగిందన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఆర్‌డీఓ వీవీఎల్ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, తహాశీల్దార్ శ్రావన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆయా వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ నమోదును నేతలు, అభ్యర్థులు ఆరా తీశారు. ప్రధాన పార్టీలు వార్డుల వారీగా 100 ఓట్లకు ఒక ఇన్‌చార్జిని నియమించారు. వారి నుంచి వివరాలు సేకరించి నేతలు, అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. ఓట్లు బాక్స్‌ల్లో నిక్షిప్తం కావడంతో.. భవితవ్యంపై సందిగ్ధం నెలకొంది. గెలుస్తామా.. లేదా? అని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: సీపీ
సిద్దిపేటకమాన్: మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 13న ఉదయం 6గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు 163 బీఎన్‌ఎస్‌ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని తెలిపారు. మతపరమైన విద్వేషాలను ప్రేరేపించే ప్రసంగాలు నిషేధమన్నారు. బాణసంచా కాల్చడం, ఊరేగింపులు చేపట్టవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్
గెలుపోటములపై అంచనాలు
పలు చోట్ల జోరుగా ధన ప్రవాహం.. ఏరులై పారిన మద్యం


