లిఫ్టు పనులు వేగిరం చేయండి
● కెనాల్‌లోని తుంగ, గడ్డి తొలగించాలి
● మాజీ మంత్రి హరీశ్‌రావు
● ఇరిగేషన్ అధికారులతో సమీక్ష
చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ కుడి కాలువలో పేరుకుపోయిన తుంగ, గడ్డిని వెంటనే తొలగించాలని, చంద్లాపూర్ లిఫ్టు పనులు త్వరగా పూర్తి చేసి మూడు నెలల్లో లిఫ్టు ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని రంగనాయక సాగర్ వద్దగల ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి మల్లన్న సాగర్ నీటి విడుదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు ఆందోళన చెందుతున్నారని, మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 13న రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. ఇర్కోడ్ లిఫ్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గోపులాపూర్, కస్తూరిపల్లి గ్రామాల వద్ద నిర్మించే చెక్‌డ్యామ్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అల్లీపూర్ వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి అల్లీపూర్ కర్నాల కుంటకు నీళ్లు వచ్చేలా లిఫ్టు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
సిద్దిపేటఅర్బన్: స్థానిక ఐటీ టవర్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎమ్మెల్యే హరీశ్‌రావు బుధవారం సందర్శించారు. ఐటీ టవర్‌లోని నాలుగు ఫ్లోర్‌లను కలియతిరిగి వివిధ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులతో ముచ్చటించి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలను తెలపగా వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సిద్దిపేట ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పన కోసం తమ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఐటీ టవర్‌లో 17 కంపెనీలు 350 మంది ఉద్యోగులు ఉన్నారని, టాస్క్ ట్రైనింగ్ సెంటర్ సైతం ఏర్పాటు చేసుకొని నిరంతరం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. టాస్క్ ట్రైనింగ్ సెంటర్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐటీ టవర్‌లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి, ఇతర కార్మికులకు జీతాలు సరిగా రావడం లేదని వెంటనే జీతాలు చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


