ఓటెత్తాలే..
పట్టణ ఓటరూ
నేడే పోలింగ్
● ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5వరకు..
● నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు
● 72 వార్డుల్లో 176 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
● ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.01లక్షల మంది
●
మున్సిపాలిటీల వారీగా ఓటర్లు..
మున్సిపాలిటీ వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం
హుస్నాబాద్ 20 9,873 9,348 06 19,227
దుబ్బాక 20 11,117 10,224 0 21,341
గజ్వేల్ 20 24,001 22,738 01 46,740
చేర్యాల 12 7,119 6,658 0 13,777
పురపోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం పోలింగ్ జరగనుంది. నాలుగు మున్సిపాలిటీలలోని 72 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణకు 1,069 మంది సిబ్బంది, 723 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1.01లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. – సాక్షి, సిద్దిపేట
నాలుగు మున్సిపాలిటీలోని 72 వార్డుల్లో 326 మంది పోటీ చేస్తున్నారు. వారం రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి, ప్రజలకు వివిధ హామీలు ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నాలుగు మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 52,110, పురుషులు 48,968, ఇతరులు ఏడుగురు ఉన్నారు. 1,22,100 బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచారు. ఇందులో చేర్యాలలో 16,800, హుస్నాబాద్‌లో 24,300, గజ్వేల్‌లో 54,300, దుబ్బాకలో 26,700 బ్యాలెట్ పేపర్లు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఓటర్లకు ఓటరు స్లిప్‌లను అందించారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చారు.
1,069 మంది సిబ్బంది
గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి పంపిణీ చేశారు. 176 పోలింగ్ కేంద్రాలుండగా 1,069 సిబ్బందిని నియమించారు. పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులు 211, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 211, ఇతర పోలింగ్ సిబ్బంది 647 మంది ఉన్నారు. బందోబస్తును 723 మందిచే ఏర్పాటు చేశారు. 31 ప్రాంతాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 68 ఉన్నాయి. ఎన్నికల సిబ్బందిని, బ్యాలెట్ బాక్స్‌లను 49 బస్సులలో తరలించారు. 22 సెక్టోరియల్ టీంలను ఏర్పాటు చేశారు.
170 పోస్టల్ బ్యాలెట్ల జారీ
ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి అధికారులు పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశారు. 170 పోస్టల్ బ్యాలెట్లకు 169 మంది వినియోగించుకున్నారు. అలాగే 15 మంది సర్వీస్ ఓటర్లకు బ్యాలెట్‌లను జారీ చేశారు. వీరి నుంచి ఈ నెల 13వ తేదీ ఉదయం 8గంటల వరకు అందితే వాటిని లెక్కించనున్నారు.


