ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
● హక్కు మరవొద్దు
● తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష
● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: అర్బన్ ప్రాంతాల్లో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు 90 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటే, అర్బన్ ప్రాంతాల్లో 50 శాతం లోపే ఓటింగ్‌లో పాల్గొంటున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో జీవన స్థితిగతులు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, వెస్ట్ మెనేజ్‌మెంట్ తదితర అంశాలపై ప్రభుత్వం సమగ్ర ఆలోచన చేస్తోందన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 600 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, వీటితో మేసీ్త్ర, వడ్రంగి వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కలవడం వల్లే బీజేపీ తొమ్మిది ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మున్సిపాలిలీలకు ప్రత్యేక నిధులు ఇవ్వడంలేదని, మనకు రావాల్సిన వాటా కూడా రావడం లేదన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు అనేక సార్లు కలిసి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరామన్నారు. అయినా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో అంతా అవినీతే జరిగిందన్నారు. పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు.
ఎల్లమ్మ చెరువు పనుల పరిశీలన
ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను మంగళవారం రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన సతీమణి మంజులతో కలిసి పరిశీలించారు. కుటుంబ సభ్యులతో కలిసి టీ స్టాల్ వద్ద చాయ్ తాగుతూ స్ధానికులతో ముచ్చటించారు. త్వరలోనే ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేసుకొని పర్యాటకులకు అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు.


