హోమ్ ఓటింగ్ ఏమాయె..
రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ బండారు రామ్మోహన్‌రావు
గజ్వేల్: గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ‘హోమ్ ఓటింగ్’ అవకాశం కల్పించారని, కానీ నేడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ బండారు రామ్మోహన్‌రావు ఆరోపించారు. మంగళవారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో మాదిరిగానే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఓటర్లు ‘హోమ్ ఓటింగ్’ కోసం దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పారు. ఓటర్లు గట్టిగా అడిగితే తీరా ఇప్పుడు ప్రోవిజన్ లేదని చెబుతున్నారని వాపోయారు. ప్రోవిజన్ లేదనే విషయాన్ని ముందుగానే ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా ‘హోమ్ ఓటింగ్’ ప్రోవిజన్ అమలయ్యేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.


