పుర పోరులో
మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి యువత బరిలోకి దిగింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డుల్లో 326 మంది పోటీ చేస్తుండగా, అందులో 95 మంది యువత ఉండటం విశేషం. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు.
– సాక్షి, సిద్దిపేట
ఎన్నికల సమయంలో కాలనీలో రోడ్డు నిర్మాణం.. జిమ్ సెంటర్ ఏర్పాటు చేస్తా.. ఆ యువజన సంఘం నూతన భవనం నిర్మాణం చేపిస్తాం.. గెలిచిన తర్వాత టూర్ తీసుకెళ్తానని పోటీలో ఉన్న అభ్యర్థులు యువతకు గాలం వేస్తుంటారు. గెలుపొందిన తర్వాత కొన్ని నెరవేర్చేవారు.. మరి కొన్నింటిని మర్చిపోయేవారు. అభ్యర్థులు ఇచ్చే అఫర్లకు కాకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత అడుగుపెడుతున్నారు. తాము గెలిస్తే పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి, మురుగు కాలువల సమస్యలు పరిష్కరించడంతో పాటు చేసే అభివృద్ధి పనులను వివరిస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
దుబ్బాక నుంచి అత్యధికంగా
నాలుగు మున్సిపాలిటీల్లో 22 నుంచి 35 సంవత్సరాల వారు 95 మంది (29 శాతం) పోటీ చేస్తున్నారు. అందులో అత్యధికంగా దుబ్బాక నుంచే యువత బరిలో ఉన్నారు. ఇందులో కొంతమంది పార్టీల తరఫున బరిలో ఉండగా.. మరికొందరు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. వీరిలో పీజీ, డిగ్రీ విద్యార్హతలు ఉన్న వారే అధికంగా ఉన్నారు. ఫలితాలపై వీరి ప్రభావం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
యువత రాజకీయాల్లో రాణించాలి
యువత రాజకీయాల్లో రాణిస్తేనే.. అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకటో వార్డు రిజర్వేషన్ కలిసి రావడంతో పోటీ చేస్తున్నా. అవకాశం ఇస్తే.. వార్డును అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నా భర్త ప్రోత్సాహంలో ముందుకు వెళ్తున్నా.
– కోటగల్ల రమ్య బీఆర్‌ఎస్ అభ్యర్థి, దుబ్బాక
ప్రజలకు సేవ చేయాలనే..
2వ వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో పోటీ చేస్తున్నా. వార్డులో చాలా మంది పేదలున్నారు. పక్కా ఇల్లు లేనివారు ఉన్నారు. వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యే విధంగా, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తా. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా.
– చెన్నబోయిన అనూష,
కాంగ్రెస్ అభ్యర్థి, హుస్నాబాద్
మున్సిపాలిటీ వార్డుల బరిలో
సంఖ్య ఉన్నవారు యువత
చేర్యాల 12 44 11
గజ్వేల్ 20 88 23
దుబ్బాక 20 102 41
హుస్నాబాద్ 20 92 20
వర్షానికి మాఽ వీధి మునిగిపోతుంది
గెలిచిన తర్వాత ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. మళ్లీ ఐదేళ్లకు కనిపిస్తున్నారు. ప్రతి వర్షాకాలం 9వ వార్డులోని పోచమ్మవీధి జలమయం అవుతుంది. అప్పటి కౌన్సిలర్, ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదు. వాటిని పరిష్కరించేందుకు ఈ సారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా.
– బింగి శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి, చేర్యాల
పుర పోరులో
పుర పోరులో


